Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దూబె, ఉతప్ప ధనాధన్
- బెంగళూర్‌పై చెన్నై ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
డిఫెండింగ్ చాంపియన్ ఎట్టకేలకు తొలి విజయం రుచి చూసింది. ఐపీఎల్ 15లో తొలి నాలుగు మ్యాచుల్లో చావుదెబ్బ తిన్న చెన్నై సూపర్‌కింగ్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై 24 పరుగుల తేడాతో భారీ తేడాతో గెలుపొందింది. శివం దూబె (95 నాటౌట్, 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (88, 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్ విశ్వరూపంతో తొలుత చెన్నై సూపర్‌కింగ్స్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 193 పరుగులకే చతికిల పడింది. దినేశ్ కార్తీక్ (34, 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుయాశ్ ప్రభుదేశారు (34, 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), షాబాజ్ నదీమ్ (41, 27 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడినా అప్పటికే మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది.
దంచికొట్టారు : తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలో ఓ వికెట్ కోల్పోయిన సూపర్‌కింగ్స్ 35 పరుగులే చేసింది. పది ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోరు 60/2. చివరి పది ఓవర్లలో ఆ జట్టు 100 పరుగులు చేసినా.. మొత్తం 160 పరుగులే అవుతుంది. మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించిన సూపర్‌కింగ్స్‌కు ద్వితీయార్థంలో విధ్వంసక విన్యాసాలు భారీ స్కోరు అందించాయి. వెటరన్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప (88), యువ బ్యాటర్ శివం దూబె (95 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఉతప్ప, దూబె విశ్వరూపంతో చివరి పది ఓవర్లలో చెన్నై ఏకంగా 156 పరుగులు పిండుకుంది. ఉతప్ప 33 బంతుల్లో అర్థ సెంచరీ బాదగా.. దూబె 30 బంతుల్లో ఆ ఘనత అందుకున్నాడు. డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఉతప్ప, దూబె సిక్సర్ల వర్షం కురిపించారు. దూబె ఎనిమిది సిక్సర్లు సంధించగా.. రాబిన్ ఉతప్ప తొమ్మిది సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు జోరుతో చెన్నై 216 పరుగులు నమోదు చేసింది.
ఛేదనలో బెంగళూర్ మెప్పించలేదు. కెప్టెన్ డుప్లెసిస్ (8), అనుజ్ రావత్ (12), విరాట్ కోహ్లి (1) విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్లో మాక్స్వెల్ (26), షాబాజ్ నదీమ్ (41), సుయుశ్ (34), దినేశ్ కార్తీక్ (34) పోరాటం సరిపోలేదు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ముకేశ్‌పై కార్తీక్ 23 పరుగులు పిండుకుని ఆసక్తి రేపినా.. ఆ తర్వాతి ఓవర్లోనే బ్రావో అతడికి విన్యాసాలకు ముగింపు పలికాడు. కార్తీక్ నిష్క్రమణతో బెంగళూర్ ఓటమి లాంఛనమైంది. 20 ఓవర్లలో బెంగళూర్ 193 పరుగులే చేసింది.
సంక్షిప్త స్కోర్లు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 216/4 (శివం దూబె 95, రాబిన్ ఉతప్ప 88, హసరంగ 2/35)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : 193/9 (షాబాజ్ నదీమ్ 41, దినేశ్ కార్తీక్ 34, మహీశ్ 4/33, జడేజా 3/39)