Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ ఔట్‌పై రవిచంద్రన్ అశ్విన్
ముంబయి : క్రికెట్లో నిబంధనలపై పూర్తి అవగాహనతో పాటు ఎప్పుడు ఏ రూల్‌ను ఉపయోగించుకోవచ్చేనే విషయంలో ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటాడు!. మన్కడింగ్ రనౌట్ (నాన్‌స్ట్రయికర్ రనౌట్)తో విమర్శలు ఎదుర్కొన్న అశ్విన్.. తాజాగా ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్‌గా నిష్క్రమించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ ఔట్‌గా వికెట్ కోల్పోయాడు. క్రికెట్ కాస్త వెనుకంజలో ఉంది, ఫుట్‌బాల్ తరహాలో వేగంగా అభివృద్ది చెందాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇటువంటి నిష్క్రమణలు సాధారణం అవుతాయని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. లక్నోపై పదో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ 23 బంతుల్లో 28 పరుగులే చేశాడు. బౌండరీలు బాదటంలో తడబడిన అశ్విన్.. 19వ ఓవర్లో రెండు బంతులు ఎదుర్కొన్న అనంతరం రిటైర్డ్ ఔట్‌గా క్రీజు వదిలాడు. దీంతో రియాన్ పరాగ్‌కు అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో రాయల్స్ 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. అశ్విన్ తీసుకున్న నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. దీంతో అశ్విన్ చర్యపై క్రికెట్ పండితులు చర్చిస్తున్నారు. 'ఇది కొన్నిసార్లు పని చేస్తుంది, మరికొన్ని సార్లు ప్రతికూలం కావచ్చు. ఫుట్‌బాల్‌లో ఇటువంటివి సర్వసాధారణం (సబ్స్టిట్యూట్స్). టీ20 క్రికెట్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. ఇంకా పాత పద్దతిలోనే ఆడుతున్నాం. ఆధునిక క్రికెట్లో పలు మార్పులు అవసరం. సాకర్‌లో సబ్‌స్టిట్యూట్స్‌ను వాడినట్టే, నేను క్రికెట్లో క్రీజు వదిలాను. ఈ విషయంలో క్రికెట్ వెనుకంజలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మామూలు స్థితికి చేరుకుంటుంది. బౌండరీల వేటలో అన్ని ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకపోయింది. మెరుగైన బ్యాటర్‌కు అవకాశం ఇవ్వటం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాను' అని అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో చెప్పుకొచ్చాడు.