Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ ఓడిన ముంబయి ఇండియన్స్
- పంజాబ్ కింగ్స్ ఖాతాలో మరో విజయం
ముంబయి ఇండియన్స్ కథ మారలేదు. పంజాబ్ కింగ్స్ చేతిలో మట్టికరించిన రోహిత్‌సేన.. సీజన్లో వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. 194 పరుగుల ఛేదనలో ప్రధాన బ్యాటర్లు దారుణంగా వైఫల్యం చెందటంతో ముంబయి ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు. మయాంక్ అగర్వాల్ (52), శిఖర్ ధావన్ (70) అర్థ సెంచరీలతో భారీ స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్ మరో విజయం ఖాతాలో వేసుకుంది.
నవతెలంగాణ-పుణె
ముంబయి ఇండియన్స్ మళ్లీ ఓడింది. పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 194 పరుగుల ఛేదనలో యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), తిలక్ వర్మ (36, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మెరిసినా.. సీనియర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్ శర్మ (28, 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (3), కీరన్ పొలార్డ్ (10) దారుణంగా విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (43, 30 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) డెత్ ఓవర్లలో ఒంటరి పోరాటం చేసినా.. మరో ఎండ్ నుంచి సహకారం కొరవడింది. ముంబయి ఇండియన్స్ గెలుపు దిశగా సాగుతున్న తరుణంలో తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్ రనౌట్ కావటం ముంబయి ఇండియన్స్‌ను గట్టిగా దెబ్బతీసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు ముంబయి ఇండియన్స్ 186 పరుగులే చేయగల్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52, 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (70, 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ శతకాలతో 198 పరుగుల భారీ స్కోరు అందించారు. జితేశ్ శర్మ (30 నాటౌట్, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షారుక్ ఖాన్ (15, 6 బంతుల్లో 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు.
ఓపెనర్ల దూకుడు : టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌కు ఏదీ కలిసి రాలేదు. వరుస పరాజయాల వేదనలో ఉన్న రోహిత్‌సేనకు పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు గట్టి పంచ్ ఇచ్చారు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (50) అర్థ సెంచరీతో మెరిశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టిన మయాంక్ 30 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. పవర్‌ప్లేలో చెలరేగిన మయాంక్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. మయాంక్ ధాటికి ఆరు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 65/0తో పటిష్టంగా నిలిచింది. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ (70) నెమ్మదిగా ఆడాడు. మయాంక్‌కు చక్కటి సహకారం అందించిన శిఖర్ ధావన్ నాలుగు ఫోర్లు, చరెండు సిక్సర్లతో 37 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. జానీ బెయిర్‌స్టో (12), లియాం లివింగ్‌స్టోన్ (2) నిరాశపరిచినా.. దేశవాళీ సంచలనాలు జితేశ్ శర్మ (30 నాటౌట్, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షారుక్ ఖాన్ (15, 6 బంతుల్లో 2 సిక్స్‌లు) కదం తొక్కారు. డెత్ ఓవర్లలో ఈ ఇద్దరి దూకుడుతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. బసిల్ తంపీ, జైదేవ్, టైమల్ మిల్స్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 193/5 (శిఖర్ ధావన్ 70, మయాంక్ అగర్వాల్ 52, జితేశ్ శర్మ 30, బుమ్రా 1/28)
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : 186/9 (డెవాల్డ్ బ్రెవిస్ 49, సూర్యకుమార్ 43, తిలక్ వర్మ 36, స్మిత్ 4/30)