Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్, రాజస్థాన్ ఢీ నేడు
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రసవత్తర సమరానికి తెరలేచింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతున్న రెండు అగ్రజట్లు నేడు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ సీజన్లో అత్యుత్తమ బౌలింగ్ విభాగాలను బరిలోకి దింపిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ పోటీకి సై అంటున్నాయి. అటు గుజరాత్ టైటాన్స్, ఇటు రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచుల్లో మూడేసి విజయాలు నమోదు చేశాయి. పేసర్లు, స్పిన్నర్ల మేళవింపుతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో సరికొత్తగా కనిపిస్తోంది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ట్రెంట్ బౌల్ట్ పేస్ సారథ్యంలో దూసుకెళ్తోంది. గత మ్యాచ్‌లో లక్నోపై ట్రెంట్ బౌల్ట్ అరివీర భయంకర తొలి ఓవర్ వేశాడు. ప్రసిద్ కృష్ణ సైతం బౌల్ట్ అండతో రెచ్చిపోతున్నాడు. కొత్త పేసర్ కుల్దీప్ సేన్ సైతం ఆకట్టుకుంటున్నాడు. లక్నోపై చివరి ఓవర్లో 15 పరుగులను కాపాడి ఔరా అనిపించాడు. అశ్విన్, చాహల్ స్పిన్ బాధ్యతలు సమర్థవంతంగా చూసుకుంటున్నాడు. చాహల్ 6.50 ఎకానమీతో ఇప్పటికే 11 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 6.87 ఎకానమీతో పరుగుల పొదుపులో అశ్విన్ ముందున్నాడు. రాయల్స్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు మరింత చెమటోడ్చాల్సి రావచ్చు. శుభ్‌మన్ గిల్‌పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. బౌలింగ్ విభాగంలో లాకీ ఫెర్గుసన్, మహ్మద్ షమిలకు తోడు హార్దిక్ పాండ్య ఉన్నాడు. ఈ త్రయం ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచగలదు. స్పిన్ మాస్టర్ రషీద్ ఖాన్ రూపంలో టైటాన్స్‌కు తిరుగులేని మాయగాడు ఉన్నాడు. రాయల్స్ బ్యాటర్లు బట్లర్, హెట్మయర్, పడిక్కల్, శాంసన్‌లపై టైటాన్స్ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో ఉన్నారు. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ నేడు మరో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో తొలి ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్ నేటి మ్యాచ్‌లో తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నేడు డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.3ం గంటలకు ఆరంభం. మంచు ప్రభావం దృష్ట్యా టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపనుంది.