Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ సంఘంపై సైనా నిప్పులు
- సెలక్షన్ ట్రయల్స్‌కు దూరం కావటంపై వివరణ
భారత బ్యాడ్మింటన్‌లో మరో దుమారం రేగింది. స్టార్ క్రీడాకారులతో భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. అర్జున అవార్డుల సిఫారసుల అంశంలో హెచ్.ఎస్ ప్రణరుని చిన్నబుచ్చిన బారు.. తాజాగా భారత బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ సైనా నెహ్వాల్‌కు సైతం చేదు అనుభవం కలిగించింది!. బారు తీరుపై సైనా నెహ్వాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : మహిళల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1, రెండు సార్లు కామన్వెల్త్ గేమ్ స్వర్ణ పతక విజేత. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాల్సిన సైనా నెహ్వాల్.. అనూహ్య నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియా, కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌కు దూరంగా ఉంటున్నట్టు సైనా నెహ్వాల్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సైనా నెహ్వాల్ నిర్ణయంపై బ్యాడ్మింటన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. టైటిల్ నిలుపుకునే ఉత్సుకత, కసి సైనా నెహ్వాల్‌లో లోపించాయనే మాటలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో సెలక్షన్ ట్రయల్స్‌కు దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను సైనా నెహ్వాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) తీరుపై సైనా నెహ్వాల్ నిప్పులు చెరిగింది.
కిందకు లాగుతోంది! : ' కామన్వెల్త్ క్రీడల పసిడి పతకాన్ని, ఆసియా క్రీడల మెడల్‌ను నిలుపుకునే ఉద్దేశం నాకు లేదనే కథనాలు చూసి ఆశ్చర్యపోయాను. మూడు వారాలుగా యూరోప్‌లో వరుస టోర్నీల్లో పాల్గొన్నాను. త్వరలోనే ఆసియా చాంపియన్‌షిప్స్ సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రయల్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. సీనియర్ క్రీడాకారిణిగా రెండు వారాల సమయంలో వరుస టోర్నీల్లో పోటీపడలేను. గాయాల బారిన పడేందుకు మరింత ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని బారు అధికారులకు తెలియజేశాను. ఆసియా, కామన్వెల్త్ క్రీడల పోటీల నుంచి నన్ను తప్పించటం వారికి సంతోషంగానే ఉన్నట్టు అనిపించింది. షెడ్యూల్‌పై మనకు మరింత స్పష్టత ఉంటే బాగుంటుంది. పది రోజుల వ్యవధితో ట్రయల్స్‌కు పిలవటం సబబు కాదు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ నం.1 అకానె యమగూచితో గెలుపు కోసం చివరి వరకు పోరాడాను. ఇండియా ఓపెన్‌లో ఓ ఓటమితో బారు నన్ను కిందకు లాగేందుకు చూస్తోంది' అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.
ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడే భారత షట్లర్లను ఎంపిక చేసేందుకు ఏప్రిల్ 2న బారు నోటీసులు ఇచ్చింది. నేడు ఇందిరా గాంధీ స్టేడియంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో ఉన్న క్రీడాకారులకు ట్రయల్స్ నుంచి మినహాయింపు లభించింది. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ ప్రస్తుత ర్యాంక్ 23. దీంతో సైనా నెహ్వాల్ కచ్చితంగా ట్రయల్స్‌కు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో మాళవిక బాన్సోద్, ఆకర్షి కశ్యప్, అష్మిత చాలిహ, అనుపమలు మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ అంతర్జాతీయ పోటీల్లో ప్రపంచ శ్రేణి షట్లర్లపై విజయాలు సాధించిన రికార్డు లేదు. దీంతో ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో సైనా నెహ్వాల్, పి.వి సింధులపైనే పతక ఆశలు ఉండేవి. వరుసగా జర్మనీ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్, స్విస్ ఓపెన్‌లో పోటీపడిన సైనా నెహ్వాల్.. కొరియా ఓపెన్‌కు దూరమైంది. గాయాల బెడదతో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సైనా నెహ్వాల్ ఇటీవల పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో బారు నుంచి సైనా నెహ్వాల్ ఊహించని పరిస్థితి చవిచూడాల్సి వచ్చింది.