Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్దిక్ అజేయ అర్థ సెంచరీ
- రాజస్తాన్‌పై గుజరాత్ గెలుపు
నవతెలంగాణ-ముంబయి
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ తఢాకా చూపించాడు. పటిష్ట రాజస్తాన్ రాయల్స్ బౌలర్లపై హార్దిక్ పాండ్య విరుచుకుపడ్డాడు. అజేయ అర్థ సెంచరీతో వీర విహారం చేయడంతో రాజస్తాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ పై 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 15 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐదు మ్యాచుల్లో గుజరాత్‌కు ఇది నాలుగో విజయం. 8 పాయింట్లతో పాండ్య జట్టు టాప్ పొజిషన్లో నిలిచింది. హార్దిక్ పాండ్య (87 నాటౌట్, 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభినవ్ మనోహర్ (43, 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ మిల్లర్ (31 నాటౌట్, 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌలర్లు లాకీ ఫెర్గుసన్ (3/23), యశ్ దయాల్ (3/40) చెలరేగటంతో రాజస్తాన్ రాయల్స్ ఛేదనలో చతికిల పడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 155 పరుగులే చేయగలిగింది.
పాండ్య ఫటాఫట్ : తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు మంచి ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ కాస్త ఇరకాటంలో పడింది. మాథ్యూ వేడ్ (12), శుభ్‌మన్ గిల్ (13), విజరు శంకర్ (2) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. అయినా, గుజరాత్ టైటాన్స్ రన్‌రేట్ విషయంలో తగ్గలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిష్క్రమించినా.. మిడిల్ ఆర్డర్ గొప్పగా రాణించింది. హార్దిక్ పాండ్య, అభినవ్ మనోహర్ జోడీ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ జంట జోరుతో కష్టాల్లో ఉన్న గుజరాత్ భారీ స్కోరు సాధించింది. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో పాండ్య 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. మనోహర్ సైతం నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. డెత్ ఓవర్లలో డెవిడ్ మిల్లర్ గ్రాండ్ ముగింపు అందించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 బంతుల్లోనే 31 పరుగులు పిండుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 192 పరుగులు చేసింది. 13 ఓవర్లలో 101/3తో ఉన్న గుజరాత్ చివరి ఓవర్లలో 91 పరుగులు చేసింది.
ఛేదనలో చతికిల : భీకర ఫామ్‌లో ఉన్న రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ 193 పరుగుల లక్ష్యాని ఛేదిస్తారనే అంచనాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ జోశ్ బట్లర్ (54, 24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసినా.. మరో ఎండ్‌లో సహచరుల సహకారం లోపించింది. దేవదత్ పడిక్కల్ (0), రవిచంద్రన్ అశ్విన్ (8), సంజు శాంసన్ (11), వాన్‌డర్ డుసెన్ (6)లు దారుణంగా విఫలమయ్యారు. చివర్లో షిమ్రోన్ హెట్మయర్ (29, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం సరిపోలేదు. టైటాన్స్ బౌలర్లు లాకీ ఫెర్గుసన్, యశ్ దయాల్ మూడు వికెట్ల ప్రదర్శనతో రాయల్స్‌ను కట్టడి చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు రాజస్తాన్ 155 పరుగులే చేసింది. 37 పరుగుల తేడాతో భారీ ఓటమి మూటగట్టుకుంది.
స్కోరు వివరాలు :
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: 192/4 (హార్దిక్ పాండ్య 87, అభినవ్ మనోహర్ 43, డెవిడ్ మిల్లర్ 31, రియాన్ పరాగ్ 1/12)
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 155/9 (జోశ్ బట్లర్ 54, షిమ్రోన్ హెట్మయర్ 29, లాకీ ఫెర్గుసన్ 3/23, యశ్ దయాల్ 3/40)