Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపజయాల బాటలో ముంబయి
- ఆరంభంలోనే నిష్క్రమణ ప్రమాదం
ఐదు మ్యాచులు, ఐదు ఓటములు. 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన ఇది. పది జట్ల ఐపీఎల్లో ఈ సారి ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా ఉండనుంది. ఐదు ఓటములు చవిచూసిన ముంబయి ఇండియన్స్ ఆరంభంలోనే ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి చేసుకునే ప్రమాదంలో పడింది. ముంబయి ఇండియన్స్ ఎక్కడ తడబడుతోంది?!
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్. రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లు ముంబయి ఇండియన్స్ సొంతం. అగ్ర జట్టు ఈ సీజన్లో ఆరంభంలోనే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. లీగ్ దశలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ సేన ఒక్క విజయం సాధించలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం అనంతరం జరుగుతున్న తొలి సీజన్లో ముంబయి ఇండియన్స్ తడబాటుకు కారణాలు ఏమిటో చూద్దాం.
మ్యాచ్ విన్నర్ లోటు : జట్టు ఎంత బాగుంటే, కెప్టెన్ అంత గొప్పగా కనిపిస్తాడు. రోహిత్ శర్మ రూపంలో ముంబయి ఇండియన్స్‌కు సమర్థ సారథి ఉన్నాడు. ముంబయికి ఐదు టైటిళ్లు అందించిన కెప్టెన్ అతడు. ముంబయి ఇండియన్స్ ప్రధాన ఆటగాళ్ల బృందం ఆటగాళ్ల వేలం అనంతరం చీలిపోయింది. ఈ ప్రభావం ముంబయి ఇండియన్స్ ఆటతీరుపై గట్టిగా పడింది. రోహిత్ శర్మ, జశ్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లను ముంబయి నిలుపుకుంది. వేలంలో రికార్డు ధరకు ఇషాన్ కిషన్‌ను తిరిగి తీసుకుంది. ఈ ఆటగాళ్లలో ఎవరూ మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించటం లేదు. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్, హైదరాబాదీ యువ ఆటగాడు తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు రాణిస్తున్నారు. సీనియర్ బ్యాటర్లు ఎవరూ మ్యాచ్‌ను గెలిపించే బాధ్యత తీసుకోవటం లేదు. వేలంలో తీసుకున్న జోఫ్రా ఆర్చర్ లేకపోవటం సైతం ముంబయి ఇండియన్స్‌కు ఎదురుదెబ్బే.
పేలవ ఫామ్ : ముంబయి ఇండియన్స్ ప్రధాన ఆటగాళ్లలో ఎవరూ మంచి ఫామ్‌లో లేరు. రోహిత్ శర్మ గత కొన్ని సీజన్లుగా విఫలమవుతున్నాడు. ఓపెనర్‌గా ఆశించిన స్కోర్లు సాధించటం లేదు. యాంకర్ పాత్ర పోషిస్తున్న రోహిత్ శర్మ సహజ శైలిలో ఆడటం లేదు. ఐదు మ్యాచుల్లో వరుసగా 41, 10, 3, 26, 28 స్కోర్లు నమోదు చేశాడు. రూ.15.25 కోట్ల ధర పలికిన ఇషాన్ కిషన్ సైతం అంచనాలను అందుకోవటం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 81, రాయల్స్‌పై 54 బాదిన కిషన్.. ఆ తర్వాత 14, 26, 3 స్కోర్లతో విఫలమయ్యాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ మినహా ఎవరూ ఫామ్‌లో లేరు. కీరన్ పొలార్డ్ 3, 22, 22, 0 స్కోర్లతో దారుణంగా నిరాశ పరిచాడు. పొలార్డ్ ఫామ్ కోల్పోవటంతో డెత్ ఓవర్లలో బిగ్ హిట్టర్ కరువయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 52, 68, 43 పరుగుల ఇన్నింగ్స్‌తో అలరిస్తున్నాడు. తిలక్ వర్మ సైతం ఫామ్‌లో ఉన్నాడు. కానీ సీనియర్ బ్యాటర్ల సహకారం ఏమాత్రం దక్కటం లేదు.
పస లేని బౌలింగ్ : ముంబయి ఇండియన్స్ శిబిరంలో జశ్‌ప్రీత్ బుమ్రా మినహా మరో ప్రపంచ శ్రేణి బౌలర్ లేడు. బుమ్రా ఐదు మ్యాచుల్లో నాలుగు వికెట్లతో నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై జైదేవ్ ఉనద్కత్ (1/44), బసిల్ తంపీ (2/47), టైమల్ మిల్స్ (0/37) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. గతంలో మాదిరి ముంబయి పేస్, స్పిన్ దాడిలో పస లేదు. ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ సేవలను ముంబయి కోల్పోయింది. ఆ ప్రభావం బౌలింగ్ దళంపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఆరంభంలో ఐదు మ్యాచుల్లో ఓడటం మిగతా జట్లకు కొత్త కానీ ముంబయి ఇండియన్స్‌కు కాదు. 2015 సీజన్లో ముంబయి ఇండియన్స్ తొలి ఆరు మ్యాచుల్లో ఏకంగా ఐదింట అపజయాలు చవిచూసింది. అయినా, ఆ సీజన్లో ముంబయి ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్లోనూ అటువంటి ప్రదర్శన పునరావృతం చేయగల సత్తా ఆ జట్టులో ఉంది. కానీ ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లోకి రాకుండా, అద్భుతాలు ఆశించలేం.