Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు కెప్టెన్సీ వదులుకున్న జో రూట్
లండన్ : ఇంగ్లాండ్ సారథిగా అత్యధిక టెస్టుల్లో (64) సారథ్యం. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టు (24) విజయాలు. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టు (26) పరాజయాలు. ఇంగ్లాండ్ సారథిగా అత్యధిక పరుగులు (5295). ఇంగ్లాండ్ సారథిగా అత్యధిక శతకాలు (14), అర్థ శతకాలు (26). నాయకుడిగా అత్యధిక క్యాచులు (87). ఐదేండ్ల పాటు ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్సీ వహించిన జో రూట్ సారథ్య పగ్గాలు వదిలేశాడు. టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత 17 టెస్టు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఒక్క టెస్టులోనే గెలుపు రుచి చూసింది. పేలవ ప్రదర్శనతో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం జో రూట్ కెప్టెన్సీ వదులుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 0-1తో కోల్పోయిన జో రూట్ ఇంగ్లాండ్.. ఓటమి భారంతోనే స్వదేశానికి చేరుకుంది. కెప్టెన్సీ వదిలేయటంపై కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన జో రూట్.. తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ' కరీబియన్ పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న అనంతరం అన్నీ ఆలోచించేందుకు సమయం చిక్కింది. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నా క్రికెట్ కెరీర్లో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది. ఇంగ్లాండ్‌కు సారథ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావించాను. తదుపరి కెప్టెన్‌గా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఆటగాడిగా ఇంగ్లాండ్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నా శక్తి మేరకు పని చేస్తాను' అని జో రూట్ తెలిపాడు. వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వ రేసులో ముందంజలో కొనసాగుతుండగా.. రోరీ బర్న్స్, స్టువర్ట్ బ్రాడ్, జోశ్ బట్లర్‌ల పేర్లు సైతం వినిపిస్తున్నాయి.