Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్‌కు దీపక్ చాహర్ దూరం
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రజట్టు, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ కీలక పేసర్ దీపక్ చాహర్ సేవలను సైతం కోల్పోయింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో గాయం బారిన పడిన దీపక్ చాహర్ బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకునే క్రమంలో దీపక్ చాహర్ మరో గాయానికి గురైనట్టు ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. దీపక్ చాహర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో దీపక్ చాహర్‌ను పూర్తి ఫిట్‌గా ఉంచేందుకు బీసీసీఐ వైద్యబృందం, ఎన్సీఏ ఫిజియోలు ఐపీఎల్‌కు విశ్రాంతి ఇవ్వమని సూచించారు. ఏప్రిల్ ఆఖరు వారంలో లోగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు అందుబాటులోకి వస్తాడని భావించినా.. తాజా గాయంతో ఐపీఎల్ 15 సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.14 కోట్ల రికార్డు ధరకు దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది. దీపక్ చాహర్ లేకపోవటంతో పవర్‌ప్లేలో ఆ జట్టు లెక్కకుమించి సమస్యలు ఎదుర్కొంటుంది. మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, ఆడం మిల్నె సహా క్రిస్ జోర్డాన్లలో ఎవరూ రాణించటం లేదు. సూపర్‌కింగ్స్ శిబిరంలో కెఎం ఆసిఫ్, రాజ్యవర్ధన్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీపక్ చాహర్ స్థానంలో చెన్నై సూపర్‌కింగ్స్ మరో ఆటగాడిని ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
కోల్‌కత నైట్‌రైడర్స్ ఓ ఫాస్ట్ బౌలర్‌ను తీసుకుంది. రసిక్ సలాం స్థానంలో హర్షిత్ రాణాను జట్టులోకి ఎంచుకుంది. సలాం ఈ సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు రెండు మ్యాచుల్లో ఆడాడు. వెన్నునొప్ని గాయంతో ఈ సీజన్‌కు రసిక్ దూరం కావటంతో నైట్‌రైడర్స్ మరో పేసర్‌ను జట్టులోకి ఎంపిక చేసుకుంది. రూ.20 లక్షల కనీస ధరకు హర్షిత్ రాణా కోల్‌కత తరఫున ఆడనున్నాడు.
కోవిడ్ కలకలం! : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోవిడ్ కేసు నమోదైంది. గత ఏడాది కోవిడ్ కేసులతో భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్‌ను అర్థాంతరంగా వాయిదా వేసి.. యుఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కోవిడ్-19 కేసు వెలుగు చూసింది. భారత జట్టు మాజీ ఫిజియో, ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియోథెరపిస్ట్ పాట్రిక్ ఫర్హార్ట్ మహమ్మారి బారిన పడినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పాట్రిక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అతడితో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.