Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18పరుగుల తేడాతో లక్నో విజయం
- ముంబయికి డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు
బ్రాబౌర్న్(ముంబయి): లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీకి తోడు ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో చెలరేగడంతో ముంబయి ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు కేఎల్ రాహుల్(103నాటౌట్) సెంచరీతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ముంబయి జట్టు చివరివరకు పోరాడినా 181పరుగులే చేయగల్గింది. దీంతో ముంబయి జట్టు వరుసగా ఆరో మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూడగా.. లక్నో జట్టు 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఓపెనర్లు డికాక్-కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మనీష్ పాండే(38) రాణించినా.. స్టోయినీస్(18), హుడా(10) నిరాశపరిచారు. కానీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయి 60బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు సాయంతో అజేయంగా 103 పరుగులు చేశాడు. దీంతో లక్నో జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఉనాద్కట్‌కు రెండు, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్‌కు తలా ఒక వికెట్ లభించాయి. భారీ ఛేదనతో బరిలోకి దిగిన ముంబయికి ఈ మ్యాచులోనూ కలిసి రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ(6) మరోసారి నిరాశపరిచాడు. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆటగాడైన ఇషన్ కిషన్(13) కూడా విఫలం కావడంతో ఆ జట్టు మరి కోలుకోలేకపోయింది. ఫలితంగా ముంబయి జట్టు ఈ సీజన్లో వరుసగా ఆరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37), డెవాల్డ్ బ్రెవీస్ (31), తిలక్ వర్మ (26), కీరన్ పొలార్డ్ (25) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), ఓపెనర్ ఇషాన్ కిషన్ (13), ఫేబియన్ అలెన్ (8), జయదేవ్ ఉనద్కత్ (14), మురుగన్ అశ్విన్ (6) పరుగులు చేశారు. బుమ్రా (0), టైమల్ మిల్స్ (0) నాటౌట్‌గా నిలిచారు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. జేసన్ హోల్డర్, రవి బిష్ణోరు, మార్కస్ స్టొయినిస్, చమీర తలో వికెట్ పడగొట్టారు.
కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీ
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(103నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. ఐపిఎల్ కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. 56బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేసాడు. సెంచరీ మార్కును బౌండరీతో సాధించిన రాహుల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా రెండో శతకంతోపాటు ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి అత్యధికంగా ఐదు సెంచరీలు బాదాడు. ఈ శతకం ద్వారా రాహుల్ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ (పంజాబ్‌పై 2సెంచరీలు), విరాట్ కోహ్లి (గుజరాత్ లయన్స్‌పై 2సెంచరీలు), డేవిడ్ వార్నర్ (కేకేఆర్‌పై 2సెంచరీలు)ల సరసన చేరాడు.
స్కోర్‌బోర్డు..
లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 103, డికాక్ (ఎల్బి) ఫాబియన్ అలెన్ 24, మనీశ్ పాండే (బి)మురుగన్ అశ్విన్ 38, స్టోయినీస్ (సి)రోహిత్ (బి)ఉనాద్కట్ 10, దీపక్ హుడా (సి)ఇషన్ కిషన్ (బి)ఉనాద్కట్ 15, కృనాల్ పాండ్యా (నాటౌట్) 1, అదనం 8. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 199పరుగులు.
వికెట్ల పతనం: 1/52, 2/124, 3/155, 4/198
బౌలింగ్: తిలక్ వర్మ 1-0-7-0, ఉనాద్కట్ 4-0-32-2, మురుగన్ అశ్విన్ 4-0-33-1, బుమ్రా 4-0-24-0, మిల్స్ 3-0-54-0, ఫాబియన్ అలెన్ 4-0-46-1.
ముంబయి ఇండియన్స్: ఇషన్ కిషన్ (బి)స్టోయినీస్ 13, రోహిత్ శర్మ (సి)డికాక్ (బి)ఆవేశ్ ఖాన్ 6, బ్రెవీస్ (సి)దీపక్ హుడా (బి)ఆవేశ్ ఖాన్ 31, సూర్యకుమార్ (సి)గౌతమ్ (బి)బిష్ణోరు 37, తిలక్ వర్మ (బి)హోల్డర్ 26, కీరన్ పొలార్డ్ (సి)స్టోయినీస్ (బి)ఛమీర 25, ఫాబియన్ అలెన్ (సి)ఛమీర (బి)ఆవేశ్ ఖాన్ 8, ఉనాద్కట్ (రనౌట్) స్టోయినీస్/డికాక్ 14, మురుగన్ అశ్విన్ (రనౌట్) డికాక్/చమీర 6, బుమ్రా(నాటౌట్) 0, మిల్స్ (నాటౌట్) 0, అదనం 15. (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 181 పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/57, 3/57, 4/121, 5/127, 6/153, 7/175, 8/181, 9/181
బౌలింగ్: హోల్డర్ 4-0-34-1, ఛమీర 4-0-48-1, ఆవేశ్ ఖాన్ 4-0-30-3, రవి బిష్ణోరు 4-0-34-1, స్టోయినీస్ 2-0-13-1, కృనాల్ పాండ్యా 2-0-16-0.