Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో మార్కరం, పూరన్ జోరు
- పంజాబ్‌పై సన్‌రైజర్స్ విజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. ఐపీఎల్ 15 పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ టాప్-4లోకి అడుగుపెట్టింది. సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన హైదరాబాద్.. విమర్శల పాలైంది. వేగంగా పుంజుకున్న విలియమ్సన్ సేన వరుసగా నాల్గో విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌పై ఊరించే లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదురులేని జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
నవతెలంగాణ-పుణె
ఎడెన్ మార్కరం (41 నాటౌట్, 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (35 నాటౌట్, 30 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఛేదనలో చెలరేగారు. 152 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ సమిష్టి ప్రదర్శన చేసింది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (34, 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాథ్యతాయుత ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఛేదనలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు హైదరాబాద్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. చివరి నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన హైదరాబాద్ తొలిసారి పాయింట్ల పట్టికలో టాప్-4లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 151 పరుగులకు కుప్పకూలింది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ (3/22), స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ (4/28) రాణించారు. పంజాబ్ ఆల్‌రౌండర్ లియాం లివింగ్‌స్టోన్ (60, 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. షారుక్ ఖాన్ (26, 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు.
ఛేదనలో ఎదురేది? : 152 పరుగుల లక్ష్యం. సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్టుకు సవాల్‌తో కూడుకున్నదే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఆరంభంలోనే నిష్క్రమించాడు ఈ స్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒత్తిడి కనిపించింది. కానీ యువ బ్యాటర్లు హైదరాబాద్‌కు అలవోక విజయాన్ని కట్టబెట్టారు. అభిషేక్ శర్మ (31), రాహుల్ త్రిపాఠి (34) అద్భుత ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వశం చేశారు. ఈ జోడీ నిష్క్రమించినా.. చివర్లో ఎడెన్ మార్కరం (41 నాటౌట్), నికోలస్ పూరన్ (35 నాటౌట్) నాల్గో వికెట్‌కు అజేయ భాగస్వామ్యంతో అదరగొట్టారు. కాస్త నెమ్మదిగా ఆడినా.. మ్యాచ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరూ బౌండరీలపై గురిపెట్టారు. 18.5 ఓవర్లలోనే హైదరాబాద్ లాంఛనం ముగించి సీజన్లో నాలుగో విజయం అందుకుంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/28) రెండు వికెట్లతో మెరిశాడు.
మెరిసిన లివింగ్‌స్టోన్ : టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ బౌలర్లు రాణించారు. పంజాబ్ కింగ్స్ కీలక టాప్-2 వికెట్లను లేపేశారు. తొలి ఆరు ఓవర్లలో 48 పరుగులు చేసిన పంజాబ్ రెండు వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (8), ప్రభుసిమ్రన్ సింగ్ (14) సహా నం.3 బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (12) విఫలమయ్యారు. ఫామ్‌లో ఉన్న లియాం లివింగ్‌స్టోన్ (60, 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మరోసారి పంజాబ్ కింగ్స్‌ను ఆదుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లను లివింగ్‌స్టోన్ అలవోకగా ఎదుర్కొన్నాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 26 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన లివింగ్‌స్టోన్.. పంజాబ్ కింగ్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. మిడిల్ ఆర్డర్లో జితేశ్ శర్మ (11) తేలిపోయినా.. షారుక్ ఖాన్ (26, 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్‌ను పరుగుల వేటలో సన్‌రైజర్స్ నిలువరించింది. హైదరాబాద్ బౌలర్లలో స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ (4/28) నాలుగు వికెట్లతో చెలరేగాడు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ (3/22) మూడు వికెట్ల ప్రదర్శనతో కదం తొక్కాడు. మార్కో జాన్సెన్, తంగరసు నటరాజన్‌లు పరుగుల నియంత్రణలో పట్టు కోల్పోయారు.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ కుమార్ 8, ప్రభుసిమ్రన్ సింగ్ (సి) నికోలస్ పూరన్ (బి) నటరాజన్ 14, జానీ బెయిర్‌స్టో (ఎల్బీ) సుచిత్ 12, లియాం లివింగ్‌స్టోన్ (సి) కేన్ విలియమ్సన్ (బి) భువనేశ్వర్ కుమార్ 60, జితేశ్ శర్మ (సి,బి) ఉమ్రాన్ మాలిక్ 11, షారుక్ ఖాన్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ కుమార్ 26, ఒడీన్ స్మిత్ (సి,బి) ఉమ్రాన్ మాలిక్ 13, కగిసో రబాడ నాటౌట్ 0, రాహుల్ చాహర్ (బి) ఉమ్రాన్ మాలిక్ 0, వైభవ్ అరోర (బి) ఉమ్రాన్ మాలిక్ 0, అర్షదీప్ సింగ్ (రనౌట్) 0, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (20 ఓవర్లలో ఆలౌట్) 151.
వికెట్ల పతనం : 1-10, 2-33, 3-48, 4-61, 5-132, 6-151, 7-151, 8-151, 9-151, 10-151.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-22-3, మార్కో జాన్సెన్ 4-0-35-0, నటరాజన్ 4-0-38-1, జగదీశ సుచిత్ 4-0-28-1, ఉమ్రాన్ మాలిక్ 4-1-28-4.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ (సి) షారుక్ ఖాన్ (బి) రాహల్ చాహర్ 31, కేన్ విలియమ్సన్ (సి) ధావన్ (బి) రబాడ 3, రాహుల్ త్రిపాఠి (సి) షారుక్ ఖాన్ (బి) రాహుల్ చాహర్ 34, ఎడెన్ మార్కరం నాటౌట్ 41, నికోలస్ పూరన్ నాటౌట్ 35, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం :(18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 152.
వికెట్ల పతనం : వైభవ్ అరోర 3,5-0-35-0, కగిసో రబాడ 4-0-29-1, అర్షదీప్ సింగ్ 4-0-32-0, రాహుల్ చాహర్ 4-0-28-2, ఒడీన్ స్మిత్ 1-0-8-0, లియాం లివింగ్‌స్టోన్ 2-0-19-0.