Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఆర్కె రోజా
(ఎస్వియు క్యాంపస్ (తిరుమల)
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారుల గుర్తింపే లక్ష్యంగా 2022 క్రీడా పాలసీని తీసుకురానున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె రోజా అన్నారు. గురువారం ఉదయం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్లో గ్రామీణ స్థాయి స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటుపై స్పోర్ట్స్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.వాణి మోహన్, శాప్ ఎండి. ప్రభాకరరెడ్డితో కలసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. క్రీడా క్లబ్‌ల ఏర్పాట్లతో ప్రతిభ గల వారిని గుర్తించి క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. గత మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో మెడల్స్ అందుకున్న 1428 మందికి రూ.4.58 కోట్లు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సోషల్ వెల్ఫేర్ శాఖ సహకారంతో క్రీడా కళాశాల ఏర్పాటు చేయనున్నామన్నారు. శాప్ ద్వారా జాతీయ క్రీడల పోటీలు, ప్రతి సంవత్సరం జిల్లాల్లో సిఎం కప్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీమోహన్, శాప్ ఎండి ప్రభాకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రపదేశ్ నిర్వహిస్తున్న క్రీడలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, మెడల్స్ గురించి వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పిడీలు, క్రీడా సంఘల ప్రతినిధులు పాల్గొన్నారు.