Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్, బుమ్రా ఎంపిక
లండన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక విజ్డన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుకు రోహిత్, బుమ్రా ఎంపికయ్యారు. వీరితోపాటు మరో ముగ్గురికి కలిసి 2021 విజ్డన్ జాబితాలో చోటు దక్కింది. రోహిత్, బుమ్రాలతో పాటు గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన డేవాన్ కాన్వే(న్యూజిలాండ్), ఓలీ రాబిన్సన్(ఇంగ్లండ్), డాన్ వాన్ నికెర్క్(దక్షిణాఫ్రికా మహిళలజట్టు కెప్టెన్) చోటు దక్కించుకున్నారు. లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ 2022 ఎడిషన్ అవార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ గెలుచుకున్నాడు. విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ ఈ వివరాలను వెల్లడించారు. 2021లో ఏకంగా 6సెంచరీలు (1708 పరుగులు) సాధించినందుకు గాను రూట్‌ను, ఇంగ్లండ్ గడ్డపై(టెస్ట్ సిరీస్) సత్తా చాటినందుకు గాను రోహిత్ శర్మ, బుమ్రాలను ఆయా అవార్డులకు ఎంపిక చేసినట్లు బ్రూత్ పేర్కొన్నాడు. గత ఏడాది వేసవిలో ఇంగ్లండ్ గడ్డపై భారత్ రెండు టెస్ట్‌లు గెలవడంలో రోహిత్ శర్మ, బుమ్రా కీలక పాత్ర పోషించారని, ఆ పర్యటనలో బుమ్రా 4టెస్ట్‌ల్లో 18వికెట్లతో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడని గుర్తు చేశాడు. ఇక రోహిత్ 4టెస్ట్‌ల్లో 368 పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచాడని పేర్కొన్నాడు. కాగా, 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా.. చివరిటెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే.