Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి
- వెయ్యి రోజుల్లో సెంచరీ నిల్..
- ఐపిఎల్‌లో ఇప్పటివరకు చేసింది 128పరుగులే..
ముంబయి: టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్ నుంచి కాస్త విరామం తీసుకుంటే మంచిదని, ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థం చేసుకోండి అంటూ హితవు పలికాడు. ఎంతటి దిగ్గజ బ్యాటర్‌కైనా కెరీర్లో ఒడుదొడుకులు సహజమేనని, అయితే వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందన్నాడు. అప్పుడే సాధారణ ఆటగాడికి లెజెండరీ ప్లేయర్‌కు తేడా ఉంటుంది. అసలే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ పోటీలు ముందున్నాయి. ఇప్పటికే అన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్‌ను దొరకబుచ్చుకుని చెలరేగుతున్నారు. అలానే విరాట్ కోహ్లీ కూడా మళ్లీ పరుగులు సాధించాలంటే కాస్త విరామం తీసుకోవడం మంచిదని చెప్పుకొచ్చాడు.
ఐపిఎల్‌లోనూ నిరాశే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ సీజన్ ఐపిఎల్‌లో 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9.. తొమ్మిది మ్యాచుల్లో చేసిన మొత్తం పరుగులు 128 మాత్రమే. రన్‌మెషీన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ.. కరోనా అనంతరం అతని బ్యాట్నుంచి ఒక్క సెంచరీని చూడలేకపోయాం. ఇక ఈ సీజన్ ఐపిఎల్‌లో రెండుసార్లు గోల్డెన్ డక్ కూడా అయ్యాడు. దాదాపు మూడేళ్లుగా విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి ప్రదర్శనతో కోహ్లి టీ20 కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక అన్ని ఫార్మాట్లలో బుధవారం నాటికి కోహ్లి 1000రోజుల్లో ఒక్క సెంచరీని నమోదు చేయలేకపోవడం గమనార్హం.