Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 23 నుంచి జూలై 4 వరకు జరగనున్న టోర్నీ
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు
హైదరాబాద్: ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులను హైదరాబాద్ దక్కించుకుంది. ఈనెల 26న జరిగిన ఆసియా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఏహెచ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలో హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ)కు ఆతిథ్య హక్కులు దక్కేలా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు నడిపిన మంత్రాంగం ఫలించింది. వచ్చే జూన్ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏసీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయని జగన్ మోహన్ రావు చెప్పారు. 'ఖతార్, జపాన్, చైనాతో పాటు 12 నుంచి 15 ఆసియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు తరఫున ఆటగాళ్లు, ఇతర సహాయ సిబ్బంది కలిపి 24 మందితో కూడిన బృందం భారత్‌కు రానుంది. వీరందరికి వేదిక సమీపంలోని విలాసవంతమైన హోటళ్లలో బస ఏర్పాaటు చేయనున్నాం. కేంద్ర, రాష్ట్ర క్రీడాశాఖలు, సారు, శాట్స్ సహకారం, సమన్వయంతో పోటీలను నిర్వహించనున్నాం. ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆహ్వానిస్తున్నాం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, తెలంగాణ సీఎం కేసీఆర్ టోర్నీ జరుగుతున్న రోజుల్లో ఏదొక సమయంలో హాజరయ్యే అవకాశముంది' అని జగన్ మోహన్ రావు వెల్లడించారు.
అల్కాస్, డీడీలో ప్రసారాలు
రోజుకు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నామని జగన్ మోహన్ రావు చెప్పారు. ఏహెచ్ఎఫ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అల్కాస్ ద్వారా ఆసియా దేశాలన్నింటిలో మ్యాచ్‌లన్నీ ప్రత్యక్షప్రసారం కానున్నాయి. భారతలో డీడీ స్పోర్ట్స్‌లో ఈ పోటీలు ప్రసారమవనున్నాయి. ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్స్‌తో కూడా చర్చలు జరుపుతున్నాం. త్వరలో ఆ వివరాలు కూడా వెల్లడించనున్నాం. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్ఎఫ్ఐ ఎగ్గిజక్యూటివ్ డైరెక్టర్ ఆనందీశ్వర్ పాండే, ప్రధాన కార్యదర్శి తేజ్‌రాజ్ సింగ్ ఆధ్వర్యంలో త్వరలో కమిటీలు వేయనున్నామని జగన్ మోహన్ రావు తెలిపారు.