Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా ఆటగాళ్లపై నిషేధంపై నాదల్, జకోవిచ్ మండిపాటు
న్యూఢిల్లీ : ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌పై అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో రష్యా క్రీడాకారులను ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో ఆడకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేకపోయినా.. వింబుల్డన్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవటంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులు ఈ ఏడాది వింబుల్డన్‌లో ఆడకుండా నిర్వాహకులు నిషేధం విధించారు. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌లు వింబుల్డన్ నిర్వాహకుల నిర్ణయం పట్ల విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మాడ్రిడ్ ఓపెన్‌లో ఆడుతున్న నాదల్, జకోవిచ్‌లు మీడియాతో మాట్లాడారు. ' సహచర రష్యా క్రీడాకారులపై నిషేధం విధించటం అన్యాయం. యుద్ధంలో జరుగుతున్న పరిణామాలకు ఆటగాళ్లది బాధ్యత కాదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోయినా, వింబుల్డన్ నిర్వాహకులు తమ నిర్ణయం తీసుకున్నారు' అని రఫెల్ నాదల్ అన్నాడు. ఏటీపీ, డబ్ల్యూటీఏలు సైతం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ నిర్ణయంపై పట్ల బహిరంగ విమర్శలు గుప్పించాయి. ' వింబుల్డన్ నిర్వాహకులది సరైన నిర్ణయం కాదు. ఇది న్యాయమైన చర్య అని నేను అనుకోను. ఇది మంచిది కాదు' అని నొవాక్ జకోవిచ్ వ్యాఖ్యానించాడు. జూన్ 27 నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఆరంభం కానుంది. యుఎస్ ఓపెన్ డిఫెడింగ్ చాంపియన్ డానిల్ మెద్వదేవ్ సహా ఆండ్రీ రూబ్లెవ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అనస్తాసియ పవ్లిచెంకోవాలు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. బెలారస్ భామ విక్టోరియ అజరెంకా సైతం వింబుల్డన్‌లో ఆడే అవకాశం కోల్పోనుంది.