Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో అయ్యర్, రానా, రింకూ జోరు
- రాజస్తాన్ రాయల్స్‌కు తప్పని పరాజయం
నవతెలంగాణ-ముంబయి
కోల్‌కత నైట్‌రైడర్స్ వరుస పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. బౌలర్ల సమిష్టి కృషితో తొలుత రాజస్తాన్ రాయల్స్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్.. ఛేదనలో బ్యాటర్ల మెరుపులతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నితీశ్ రానా (48 నాటౌట్, 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (42 నాటౌట్, 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌లకు తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34, 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఈ ముగ్గురు బ్యాటర్ల మెరుపులతో 19.1 ఓవర్లలోనే కోల్‌కత నైట్‌రైడర్స్ లాంఛనం పూర్తి చేసింది. స్వల్ప స్కోరును కాపాడుకునే క్రమంలో స్పిన్ ద్వయం చాహల్, అశ్విన్‌లపై ఆశలు పెట్టుకున్న రాజస్తాన్ రాయల్స్ పరాజయం మూటగట్టుకుంది. అశ్విన్, చాహల్ జోడీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. స్పిన్నర్ల వైఫల్యంతో రాజస్థాన్ తేలిపోయింది. అంతకుముందు, కెప్టెన్ సంజు శాంసన్ (54, 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో రాణించినా కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. భీకర ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ (22, 25 బంతుల్లో 3 ఫోర్లు) నిరాశపరచటంతో రాయల్స్ ఆశించిన స్కోరు సాధించలేదు. ఇన్నింగ్స్‌లో ఎక్కడా రాయల్స్ బ్యాటర్లు చెలరేగేందుకు కోల్‌కత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. శివం మావి, ఉమేశ్ యాదవ్, అనుకూల్ రారు, సునీల్ నరైన్‌లు బంతితో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
బట్లర్ విఫలం : మూడు శతకాలు, మూడు అర్థ శతకాలతో సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో దూసుకెళ్తోన్న జోష్ బట్లర్ (22)కు కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లు చెక్ పెట్టారు. టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ తొలుత రాజస్థాన్ రాయల్స్‌ను స్వల్ప స్కోరుకు నిలువరించారు. పవర్‌ప్లేలోనూ రాజస్తాన్ ఆశించిన పరుగులు చేయలేదు. మూడు బౌండరీలు బాదిన బట్లర్ అప్పటికి జోరందుకోలేదు. స్కోరు వేగం పెంచే క్రమంలో టిమ్ సౌథీపై దాడికి దిగిన బట్లర్ విలువైన వికెట్‌ను జారవిడిచాడు. 25 బంతుల్లో 22 పరుగులే చేసిన బట్లర్ దారుణంగా నిరాశపరిచాడు. ఉమేశ్ యాదవ్ ఆరంభంలోనే ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (2)ను వెనక్కి పంపించి రాయల్స్‌కు గట్టి పంచ్ ఇచ్చాడు. కోల్‌కత బౌలర్ల మెరుపులతో రాజస్తాన్ రాయల్స్ పది ఓవర్లలో 62/2తో నిలిచింది.
శాంసన్ మెరిసినా..! : కోల్‌కత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసిన మ్యాచ్‌లో సంజు శాంసన్ (54) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కిన సంజు శాంసన్ సహజ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. శాంసన్ స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడకుండా బౌలర్లు నిలువరించారు. ఓ ఎండ్‌లో శాంసన్ నిలిచినా రాయల్స్ స్కోరు వేగంలో మార్పు రాలేదు. చివర్లో రియాన్ పరాగ్ (19, 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), షిమ్రోన్ హెట్మయర్ (27 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. రాజస్తాన్ రాయల్స్‌కు 152 పరుగుల గౌరవప్రద స్కోరు అందించారు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : జోష్ బట్లర్ (సి) శివం మావి (బి) టిమ్ సౌథీ 22, దేవదత్ పడిక్కల్ (సి,బి) ఉమేశ్ యాదవ్ 2, సంజు శాంసన్ (సి) రింకూ సింగ్ (బి) శివం మావి 54, కరుణ్ నాయర్ (సి) రింకూ సింగ్ (బి) అనుకూల్ రారు 13, రియాన్ పరాగ్ (సి) అనుకూల్ రారు (బి) టిమ్ సౌథీ 19, షిమ్రోన్ హెట్మయర్ నాటౌట్ 27, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 152.
వికెట్ల పతనం : 1-7, 2-55, 3-90, 4-115, 5-115.
బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 4-1-24-1, అనుకూల్ రారు 4-0-28-1, సునీల్ నరైన్ 4-0-19-0, శివం మావి 4-0-33-1, టిమ్ సౌథీ 4-0-46-2.
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : బాబ ఇంద్రజిత్ (సి) అశ్విన్ (బి) ప్రసిద్ కృష్ణ 15, అరోన్ ఫించ్ (బి) కుల్దీప్ సేన్ 4, శ్రేయస్ అయ్యర్ (సి) శాంసన్ (బి) బౌల్ట్ 34, నితీశ్ రానా నాటౌట్ 48, రింకూ సింగ్ నాటౌట్ 42, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం :(19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 158.
వికెట్ల పతనం : 1-16, 2-32, 3-92.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-25-1, ప్రసిద్ కృష్ణ 4-0-37-1, కుల్దీప్ సేన్ 3.1-0-28-1, అశ్విన్ 4-0-33-0, చాహల్ 4-0-31-0.