Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్సీపై ఎం.ఎస్ ధోని వ్యాఖ్య
ముంబయి : కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో అగ్ర జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య పగ్గాలు అందుకున్నాడు. అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా జడేజా దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ భారం మోయలేని రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలను తిరిగి ఎం.ఎస్ ధోనికి అప్పగించాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్‌కింగ్స్ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌పై విజయానంతరం ధోని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాయకత్వ బాధ్యతలు రవీంద్ర జడేజా ఆటపై ప్రతికూల ప్రభావం చూపాయని మహి అభిప్రాయపడ్డాడు. ' ఈ సీజన్లో కెప్టెన్సీ చేయాల్సి ఉంటుందని జడేజాకు గత సీజన్లోనే తెలుసు. తొలి రెండు మ్యాచుల్లో జడేజా పని తీరును పర్యవేక్షించాను. ఆ తర్వాత అతడి పని అతడు చేసుకోనిచ్చాను. మ్యాచ్‌లో నిర్ణయాలు తీసుకుని, వాటికి బాధ్యత వహించేలా జడేజాను నిర్దేశించాను. కెప్టెన్సీతో పాటు పలు కొత్త డిమాండ్లు తెరపైకి వస్తాయి. పలు సవాళ్లు జడేజా ఆలోచలనలను ప్రభావితం చేశాయి. నాయకత్వం జడేజా సన్నద్ధత, ప్రదర్శనను దెబ్బకొట్టిందని నా అభిప్రాయం. కెప్టెన్సీ నిరంతరం మార్పు. కెప్టెన్‌కు ప్రతిసారి ఎవరో ఒకరు సలహాలు ఇవ్వరు. మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. వాటికి పూర్తి బాధ్యత వహించాలి. కెప్టెన్ చాలా అంశాలను చూసుకోవాలి, స్వీయ ఆటతీరు అందులో ఒకటి' అని ధోని అన్నాడు.
బౌలర్లు అది తెలుసుకోవాలి! : 203 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లు సమర్థవంతంగా నిలువరించారు. భారీ ఛేదనలో బౌలర్లు తెలుసుకోవాల్సిన అంశంపై ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. 'పవర్‌ప్లే అనంతరం స్పిన్నర్ల రాక చెన్నైకి పని చేసింది. ఒకట్రెండు ఓవర్లలో 25-26 పరుగులు ఇచ్చాం. అప్పుడు 200 పరుగులు చేసినా.. లక్ష్యం 19 ఓవర్లలో 175-180కి మారిపోతుంది. బౌలర్లు కొంత భిన్నంగా ప్రయత్నించటం అనివార్యం. నా బౌలర్లకు సైతం చెబుతుంటాను. ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు ఇచ్చినా.. మిగిలిన రెండు బంతులను మంచిగా వేయటం ముఖ్యం. భారీ ఛేదనలో ఆ రెండు బంతులు ఎంతో వ్యత్యాసం చూపించగలవు. 3-4 సిక్సర్లు కొట్టగానే బౌలర్లు నీరసించి చేతులెత్తేస్తారు. కానీ అలా చేయకూడదు. చివరి రెండు బంతులకు సిక్సర్లకు బదులుగా బౌండరీలు వెళ్లినా జట్టుకు అది ఉపయోగమే. ఈ సిద్ధాం తంపై బౌలర్లకు నమ్మకం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఇది నిజంగా పని చేస్తుంది' అని ధోని అన్నాడు.