Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్‌లో 172 స్థానాలు
- 2024 పారిస్ ఒలింపిక్స్
న్యూఢిల్లీ : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ అర్హత ప్రక్రియ ఖరారు అయ్యింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) రూపొందిన అర్హత నిబంధనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ వచ్చే ఏడాది మే 1 నుంచి ఆరంభం కానుంది. 2024, ఏప్రిల్ 30 వరకు అర్హత టోర్నీలు జరుగనున్నాయి. ఈ టోర్నీల్లో ప్రదర్శన, ర్యాంకింగ్స్ ఆధారంగా పారిస్ ఒలింపిక్స్‌కు షట్లర్లను ఎంపిక చేయనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌కు 172 స్థానాలు కేటాయించారు. ఇందులో 86 మంది పురుషులు, 86 మంది మహిళల స్థానాలు ఉన్నాయి. ఆతిథ్య దేశం రెండు స్థానాలకు తోడు నాలుగు యూనివర్శాలిటీ స్థానాలు సైతం ఉన్నాయి. గతంలో రెగ్యులర్ 166 స్థానాలకు ఈసారి అదనంగా వీటిని జోడించారు. ప్రతి దేశం (జాతీయ ఒలింపిక్ కమిటీ) నుంచి గరిష్టంగా ఎనిమిది మంది (పురుషులు, మహిళలు విభాగాల వారీగా) క్రీడాకారులు మాత్రమే ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుంది. సింగిల్స్ విభాగాల్లో టాప్-16లో నిలిచిన ఇద్దరు క్రీడాకారులకు, డబుల్స్ విభాగంలో టాప్-8లో నిలిచిన రెండు జోడీలకు మాత్రమే ప్రతి దేశం నుంచి అర్హత ఉంటుంది. సాధారణ ఎంపిక ప్రక్రియ ముగిసిన అనంతరం ట్రిపార్టీ కమిషన్ ప్రత్యేకంగా ఐదు కాంటినెంటల్ ఫెడరేషన్స్ నుంచి అథ్లెట్లు ఉండేలా క్రీడాకారులను ఎంపిక చేయనుంది.