Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బెంగళూర్‌తో కీలక పోరు
పుణె : తొమ్మిది మ్యాచులు. మూడు విజయాలు. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానం. ఐపీఎల్ 15లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ పరిస్థితి ఇది. కెప్టెన్సీ పగ్గాలు తిరిగి ఎం.ఎస్ ధోని అందుకున్న అనంతరం తొలి మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ రాత మారినట్టు కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సూపర్‌కింగ్స్ ఎంతో మెరుగైన ప్రదర్శన చేసింది. సీజన్లో బలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మెరుపు విజయం నమోదు చేసింది. ఇప్పటికే ఆరు పరాజయాలు చవిచూసిన చెన్నై సూపర్‌కింగ్స్.. మరో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో సూపర్‌కింగ్స్ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కెప్టెన్సీ బాధ్యతలు త్యజించిన జడేజా సన్‌రైజర్స్‌తో బంతితో మ్యాజిక్ చేశాడు. మిడిల్ ఓవర్లలో 18 బంతుల్లో 15 పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నేడు బెంగళూర్ బ్యాటర్లు మాక్స్వెల్, విరాట్ కోహ్లిలను నిలువరించాల్సిన బాధ్యత సైతం జడేజా తీసుకోనున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ నిలకడగా విఫలమవుతున్నప్పటికీ.. గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో ఫామ్‌లోకి రావటం బెంగళూర్‌కు శుభ సూచకం. విలువైన పరుగులు రాబట్టిన విరాట్ కోహ్లి ఆ జోరుతో అచ్చొచ్చిన ప్రత్యర్థి సూపర్‌కింగ్స్‌పై చెలరేగాలని చూస్తున్నాడు. మరో 51 పరుగులు జోడిస్తే చెన్నై సూపర్‌కింగ్స్‌పై వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పనున్నాడు. ఐపీఎల్లో ఓ జట్టుపై చేసిన అత్యధిక పరుగులు ఇవే కావటం విశేషం. మరోవైపు పది మ్యాచుల్లో ఐదు విజయాలతో కొనసాగుతున్న బెంగళూర్‌కు సైతం ఈ మ్యాచ్ కీలకం. టాప్-4లో చోటు కోసం ప్రయత్నిస్తున్న బెంగళూర్ నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ నేడు రాత్రి 7.30 గంటలకు పుణెలో ఆరంభం కానుంది.