Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమంగా పెరుగుతున్న డిమాండ్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఉత్కంఠ మ్యాచుల్లో అంపైర్ల నిర్ణయాలు మ్యాచు ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో వైడ్లు, నో బాల్స్ (హైట్)కు సైతం డిఆర్ఎస్ వర్తింపచేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కోల్‌కత నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఈ మేరకు డిమాండ్ చేశారు. కోల్‌కతపై చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో 19వ ఓవర్లో అంపైర్ మూడు వైడ్లు ప్రకటించాడు. బ్యాటర్లు రింకూ సింగ్, నితీశ్ రానాలు ఆఫ్ స్టంప్ దిశగా కదులుతున్నప్పటికీ అంపైర్ వైడ్ నిర్ణయం ప్రకటించం వివాదానికి కారణమైంది. రాజస్తాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 223 పరుగుల ఛేదనలో చివరి ఓవర్లో రోవ్మాన్ పావెల్ తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతి హైట్ పరంగా నో బాల్. కానీ అంపైర్ నో బాల్ ఇవ్వలేదు. దీంతో రిషబ్ పంత్, కోచ్ ప్రవీణ్ ఆమ్రేలు మైదానంలోకి వచ్చి అంపైర్‌తో వాదనకు దిగారు. ఐపీఎల్ క్రీడా నియామళిని ఉల్లంఘించారు. ' వైడ్లు, నో బాల్స్ సమీక్ష కోరే అవకాశం ఆటగాళ్లకు ఉండాలి. పొరపాట్లు సరిదిద్దుకునేందుకే డిఆర్ఎస్కు తీసుకొచ్చారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ అంపైర్లు నిర్ణయాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎందుకు సవాల్ చేయకూడదని?' అని వెటోరి ప్రశ్నించాడు. ' పొట్టి ఫార్మాట్లో బౌలర్లకు పెద్ద అవకాశం ఉండదు. బ్యాటర్లు హిట్టింగ్ చేస్తున్నప్పుడు వైడ్ యార్కర్లు, వైడ్ లెగ్ కట్టర్లు వేయటం అనివార్యం. వాటిని వైడ్లుగా ప్రకటిస్తే బౌలర్లు ఇరకాటంలో పడతారని' ఇమ్రాన్ తాహీర్ అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియాలో వైడ్లు, నో బాల్స్‌కు డిఆర్ఎస్ ఉండాలనే చర్చ జోరుగా నడుస్తోంది. క్రికెట్లో ప్రతి దానికి డిఆర్ఎస్ అమలు చేస్తూ పోతే 3 గంటల్లో ముగియాల్సిన మ్యాచ్ 5 గంటలు సాగుతుందని ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.