Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహ్మదాబాద్‌లో ఐపీఎల్ టైటిల్ పోరు
- ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ముందుగా ఊహించినట్టుగానే బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల సొంత రాష్ట్రాలకు కీలక ప్లే ఆఫ్స్ మ్యాచులను తరలించారు. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌కు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రెండో క్వాలిఫయర్‌కు, ఫైనల్స్‌కు అహ్మదాబాద్‌లో మెగా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మే 29న ఐపీఎల్ 15 ఫైనల్ జరుగునుండగా.. మే 24న తొలి క్వాలిఫయర్‌తో ప్లే ఆఫ్స్ షురూ కానున్నాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచులు అభిమానుల సమక్షంలోనే నిర్వహించనున్నారు. ఈ సీజన్‌కు తొలుత 25 శాతం అభిమానులను అనుమతించగా.. అనంతరం పరిమితిని 50 శాతానికి పెంపుదల చేసిన సంగతి తెలిసిందే.
4 మ్యాచుల ముచ్చట! : మహిళల టీ20 చాలెంజ్ మరోసారి నాలుగు మ్యాచుల ముచ్చటగానే ఉండనుంది. పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్ కోసం ప్రతి ఏడాది డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ.. బీసీసీఐ ఆ దిశగా కార్యాచరణ రూపొందించటం లేదు. కోవిడ్-19 సాకుతో గత ఏడాది మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీకి మంగళం పాడేసిన బీసీసీఐ తాజాగా పాత జట్లతోనే షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 23న తొలి మ్యాచ్ జరుగనుండగా.. మే 28న ఫైనల్స్ నిర్వహించనున్నారు. మహిళల టీ20 చాలెంజ్‌కు పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది. మహిళల ఐపీఎల్‌కు సైతం అభిమానులను అనుమతించనున్నారు.