Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు వికెట్లతో మెరిసిన పేసర్
- గుజరాత్ టైటాన్స్ 143/8
ముంబయి : పంజాబ్ కింగ్స్ బౌలర్లు కదం తొక్కారు. స్టార్ పేసర్ కగిసో రబాడ (4/33) నాలుగు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరగటంతో గుజరాత్ టైటాన్స్ తేలిపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ టైటాన్స్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేసింది. సాయి సుదర్శన్ (65 నాటౌట్, 50 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో రాణించినా గుజరాత్ టైటాన్స్ ఆశించిన స్కోరు అందుకోలేదు. కీలక బ్యాటర్లు డెవిడ్ మిల్లర్ (11), హార్దిక్ పాండ్య (1), రాహుల్ తెవాటియ (11) తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ కింగ్స్ గెలుపు దిశగా సాగుతోంది. శిఖర్ ధావన్, భానుక రాజపక్సె మెరుపులతో 11 ఓవర్లలో 84/1తో దూసుకెళ్తోంది.
రాణించిన సుదర్శన్ : కీలక టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ప్లే ఆఫ్స్‌లో చోటు ఖాయం చేసుకున్న హార్దిక్‌పాండ్య సేన.. కొత్త సవాల్‌ను ఎదుర్కొనేందుకు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ నిర్ణయం ఆ జట్టుకు అంత మేలు చేయలేదు. పంజాబ్ కింగ్స్ పేసర్లు సమిష్టి ప్రదర్శనతో టైటాన్స్ బ్యాటర్లను సమర్థవంతంగా నిలువరించారు. ఆ జట్టులో ఏ బ్యాటర్‌ను స్వేచ్ఛగా పరుగులు చేయనివ్వలేదు. ఓపెనర్ వృద్దిమాన్ సాహా (21, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలు బాదినా.. బౌలర్లపై ఆధిపత్యం చూపించలేదు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ (9) మరోసారి విఫలమయ్యాడు. నం.3 బ్యాటర్ సాయి సుదర్శన్ (65 నాటౌట్) క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ.. గుజరాత్ టైటాన్స్ ఆశించిన స్కోరు చేయలేదు. అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కిన సుదర్శన్ వేగంగా పరుగులు పిండుకోవటంలో తేలిపోయాడు. సుదర్శన్‌ను పంజాబ్ బౌలర్లు తేలిగ్గా బురిడీ కొట్టించారు. చివరి ఓవర్లో సైతం సుదర్శన్ ఆశించిన మెరుపులు చూపించ లేదు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించి గుజరాత్ టైటాన్స్ గౌరవ ప్రద స్కోరు సాధించటంలో సుదర్శన్ విజయవంతమయ్యాడు!. కెప్టెన్ హార్దిక్ పాండ్య (1), డెవిడ్ మిల్లర్ (11), రాహుల్ తెవాటియ (11)లు నిరాశ పరిచారు. లోయర్ ఆర్డర్లో ధనాధన్ హిట్టర్లు నిష్క్రమించటంతో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. రషీద్ ఖాన్ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబాడ (4/33) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. సందీప్ శర్మ (0/17) బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. పంజాబ్ బౌలర్లు రాణించటంతో గుజరాత్ 20 ఓవర్లలో 143 పరుగులే చేసింది.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : వృద్దిమాన్ సాహా (సి) అగర్వాల్ (బి) రబాడ 21, శుభ్‌మన్ గిల్ రనౌట్ 9, సాయి సుదర్శన్ నాటౌట్ 65, హార్దిక్ పాండ్య (సి) శర్మ (బి) రిషి ధావన్ 1, డెవిడ్ మిల్లర్ (సి) రబాడ (బి) లివింగ్‌స్టోన్ 11, రాహుల్ తెవాటియ (సి) సందీప్ శర్మ (బి) రబాడ 11, రషీద్ ఖాన్ (సి) శర్మ (బి) రబాడ 0, ప్రదీప్ సంగ్వాన్ (బి) అర్షదీప్ సింగ్ 2, లాకీ ఫెర్గుసన్ (సి) లివింగ్‌స్టోన్ (బి) రబాడ 5, అల్జారీ జోసెఫ్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143.
వికెట్ల పతనం : 1-17, 2-34, 3-44, 4-67, 5-112, 6-112, 7-122, 8-129.
బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-17-0, కగిసో రబాడ 4-0-33-4, అర్షదీప్ సింగ్ 4-0-36-1, రిషి ధావన్ 4-0-26-1, లియాం లివింగ్‌స్టోన్ 2.3-0-15-1, రాహుల్ చాహర్ 1.3-0-11-0.