Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్దిమాన్ సాహా కేసులో బీసీసీఐ నిర్ణయం
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెటర్‌తో దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో ఓ పాత్రికేయుడిపై రెండేండ్ల నిషేధం విధించింది. టాక్ షో హౌస్ట్, క్రీడా పాత్రికేయులు బొరియా మజుందార్‌పై రెండేండ్ల నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో భారత వికెట్ కీపర్, బ్యాటర్ వృద్దిమాన్ సాహాను బొరియా మజుందార్ భయపెట్టే రీతిలో బెదిరించినట్టు నిర్ధారణ అయ్యింది. త్రి సభ్య కమిటీ సూచన మేరకు బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బొరియా మజుందార్‌పై ఐసీసీ టోర్నీల్లో సైతం నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బోర్డు కోరినట్టు తెలుస్తోంది.
జాతీయ జట్టులో చోటు కోల్పోయిన వృద్దిమాన్ సాహాను టాక్ షో ఇంటర్వ్యూకు బొరియా మజుందార్ అడిగారు. వృద్దిమాన్ సాహా అందుకు నిరాకరించారు. దీంతో బొరియా మజుందార్ పలు సందేశాలను సాహాకు పంపించారు. బెదిరింపు ధోరణిని ఎండగడుతూ ఆ సందేశాల స్కీన్ షాట్‌ను సాహా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వ్యవహారంపై బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు డిమాండ్ చేశారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్, కౌన్సిలర్ ప్రభుతేజ్ సింగ్ భాటియాలతో కూడిన త్రి సభ్య సంఘం దీనిపై విచారణ జరిపింది. బొరియా మజుందార్ ఇంటర్వ్యూ కోసం సాహాపై ఒత్తిడి చేయటంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్టు తేల్చింది. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులకు బొరియా మజుందార్‌పై రెండేండ్ల నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు తెలిపింది. దీని ప్రకారం రెండేండ్ల పాటు భారత క్రికెట్ కవరేజ్ చేసేందుకు మీడియా అక్రిడిటేషన్ కార్డు నిరాకరణ, రెండేండ్ల పాటు భారత క్రికెటర్లను ఇంటర్వ్యూ చేయడానికి వీలు లేకుండా నిషేధం, రెండేండ్ల పాటు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాల అధికారులతో సంప్రదింపులు చేయడానికి వీల్లేకుండా నిషేధం విధించారు.