Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
నవతెలంగాణ-న్యూఢిల్లీ : భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సవరణలపై ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు. రానున్న రోజుల్లో ఏ క్షణంలోనైనా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడనుంది. దీంతో ఐఓఏలో ఎన్నికల వాతావరణం, రాజకీయ వేడి మొదలైంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరెందర్ బత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాలు రెండు గ్రూపులు విడిపోయారు. భారత ఒలింపిక్ సంఘంలో రెండు చీలికలతో పాటు ఈ వాతావరణం జాతీయ క్రీడా సమాఖ్యలకు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు చేరుకుంది. జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు అటు బత్రా వైపు, ఇటు రాజీవ్ మెహతా వైపు మొహరిస్తున్నాయి. దీంతో హైకోర్టు తీర్పుకు ముందే ఐఓఏలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది.
అంత సులువు కాదు! : భారత ఒలింపిక్ సంఘం రాజ్యాంగంలో ప్రధానంగా 13 సంస్కరణలకు న్యాయస్థానంలో క్రీడా శాఖ కార్యదర్శి పట్టుబట్టారు. జాతీయ క్రీడా విధానానికి ఐఓఏ రాజ్యాంగం అనుగుణంగా లేదని, అందుకు తగిన మార్పులు అనివార్యమని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా నుంచి ఆసక్తికర సవరణకు మార్చి 23, 2022న హైకోర్టులో పిటిషను దాఖలు అయ్యింది. రాజ్యాంగంలో ప్రకరణ 11.1.3 ప్రకారం ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు రెండోసారి పదవిని దక్కించుకోవాలంటే ఎన్నికల్లో 2/3వ వంతు ఓటింగ్ సాధించాలి. భారత ఒలింపిక్ సంఘం రాజకీయాల్లో అది అసాధ్యం. భారత ప్రభుత్వం ఈ సవరణకు అనుకూలంగా ఉందనే పత్రాలను సైతం కోర్టులో సమర్పించారు.
భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలపై ఇంకా స్పష్టత రాలేదు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు ఓ అడ్మినిస్ట్రేటర్‌ను ఢిల్లీ హైకోర్టు నియమించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆగస్టులో కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు ఉండటంతో ఐఓఏ ప్రతినిధులుగా ఎవరు వెళ్తారనే అంశంపై చిక్కుముడి పడింది. ప్రతిష్టాత్మక క్రీడలకు ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ క్రీడాకారుల ఎంపిక, క్రీడా సామాగ్రి సహా ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణ గందరగోళంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఐఓఏ రెండు గ్రూపులుగా చీలిన నేపథ్యంలో సఖ్యత వాతావరణానికి చోటు ఉండే అవకాశం కనిపించటం లేదు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని అధ్యక్షుడు నరెందర్ బత్రా భావిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం భారత ఒలింపిక్ సంఘంలో అసలు రాజకీయం మొదలు కానుంది.