Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి
- చెన్నైపై బెంగళూర్ ఘన విజయం
నవతెలంగాణ-పుణె
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్ చేతులెత్తేసింది. 174 పరుగుల ఊరించే ఛేదనలో గెలుపు దిశగా సాగినట్టే సాగిన సూపర్‌కింగ్స్.. డెత్ ఓవర్లలో అనూహ్యంగా చతికిల పడింది. 13 పరుగుల తేడాతో ఓటమి చెందిన చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు ఆశలు ఆవిరి చేసుకుంది. సీజన్లో ఏడో పరాజయంతో టాప్-4లో నిలిచే అవకాశాలను ధోనీసేన చేజేతులా చేజార్చుకుంది. మరోవైపు ఏడో విజయం నమోదు చేసిన బెంగళూర్ టాప్-4లోకి అడుగుపెట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (56, 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీకి తోడు మోయిన్ అలీ (34, 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా ఫలితం లేకపోయింది. రాబిన్ ఉతప్ప (1), అంబటి రాయుడు (10), రవీంద్ర జడేజా (3), ఎం.ఎస్ ధోని (2) దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (28, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వేలు తొలి వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ ప్రథమార్థంలో లక్ష్యం దిశగా దూసుకెళ్లిన సూపర్‌కింగ్స్‌ను బెంగళూర్ బౌలర్లు కట్టడి చేశారు. హర్షల్ పటేల్, హసరంగ డి సిల్వ కీలక ఓవర్లతో సూపర్‌కింగ్స్ లయ దెబ్బకొట్టారు. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు చెన్నై 160 పరుగులే చేసింది. అంతకముందు, మహిపాల్ (42, 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (26 నాటౌట్, 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు నమోదు చేసింది. సూపర్‌కింగ్స్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మూడు వికెట్ల మాయజాలంతో బెంగళూర్ భారీ స్కోరు ఆశలకు గండి కొట్టాడు.
మహిపాల్ మెరుపులతో.. : టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత మ్యాచ్‌లో రాణించటంతో ఈ మ్యాచ్‌లోనూ ఆ ఇద్దరిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లి (30, 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా.. డుప్లెసిస్ (38, 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కాపాడుకోలేదు. తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన ఓపెనర్లు పవర్ ప్లే అనంతరం లయ కోల్పోయారు.
డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ (3), విరాట్ కోహ్లిలు స్వల్ప విరామంలో క్రీజు వదిలేశారు. దీంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పడింది. యువ బ్యాటర్ మహిపాల్ (42) వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అలరించాడు. చివర్లో దినేశ్ కార్తీక్ (26 నాటౌట్) మరోసారి బెంగళూర్‌ను ఆదుకున్నాడు. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన కార్తీక్ బెంగళూర్‌కు పోరాడగలిగే స్కోరు అందించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లలో మహీశ్ తీక్షణ మూడు వికెట్ల ప్రదర్శన చేయగా..రవీంద్ర జడేజా (0/20), మోయిన్ అలీ (2/28) బ్యాటర్లను కట్టడి చేశారు. పేసర్ ప్రిటోరిస్ (1/42) మూడు ఓవర్లలోనే 42 పరుగులు సమర్పించుకున్నాడు.
స్కోరు వివరాలు :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ :173/8 (మహిపాల్ 42, డుప్లెసిస్ 38, దినేశ్ కార్తీక్ 26, మహీశ్ తీక్షణ 3/27)
చెన్నై సూపర్‌కింగ్స్ : 160/8 ( డెవాన్ కాన్వే 56, మోయిన్ అలీ 34, రుతురాజ్ 28, హర్షల్ పటేల్ 3/35)