Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ నుంచి 937 మంది బృందానికి అనుమతి
- 2022 హౌంగ్జౌ నిర్వాహకుల ప్రణాళికలు
- నేడు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ భేటీలో రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి ప్రపంచంపై పంజా విసిరిన తరుణంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్లు మంచి పాఠమే నేర్చుకున్నారు. మైదానంలో అభిమానుల కేరింతలు, క్రీడా గ్రామంలో సహచర క్రీడాకారుల సందడితో పండుగ వాతావరణంలో పోటీపడే అథ్లెట్లు గత ఏడాది టోక్యోలో బయో బబుల్‌లో పోటీ పడ్డారు. టోక్యో అనుభవం ఆసియా అథ్లెట్లకు త్వరలోనే ఉపయోగపడనుంది!. ఆసియా క్రీడలు 2022 సైతం బయో బబుల్‌లోనే నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నేడు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఏఓసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఆసియా క్రీడల నిర్వహణ రోడ్ మ్యాప్‌పై హౌంగ్జౌ నిర్వాహణ కమిటీ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రపంచకప్‌లు, ప్రపంచ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ క్రీడలతో బిజీ బిజీగా గడుపనున్న భారత క్రీడాకారులు.. బర్మింగ్‌హామ్‌లో పెద్దగా ఆంక్షలు లేని వాతావరణంలోనే గడపనున్నారు. కానీ హౌంగ్జౌలో వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది.
జీ కోవిడ్ పాలసీ! : ఆసియా క్రీడల నిర్వహణ సందర్భంగా చైనా జీరో కోవిడ్ పాలసీని పాటించనుంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా నిర్వహించిన చైనా.. అదే రీతిలో ఆసియా క్రీడలకు సైతం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చైనాలో కోవిడ్-19 వేరియట్ ఒమైక్రాన్ పంజా విసురుతోంది. ఆసియా క్రీడల వేదిక హౌంగ్జౌ సహా షాంఘైలో కోవిడ్ కేసులు ఇబ్బడిమబ్బడిగా వస్తున్నాయి. గత నెల రోజులుగా షాంఘై నగరం కఠిన లాక్‌డౌన్‌లోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల నిర్వహణ చైనాకు కత్తి మీద సాములా మారింది. అయినా, కోవిడ్ రహిత వాతావరణంలో ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయి క్రీడా పోటీలైన ఆసియా క్రీడలను నిర్వహించేందుకు చైనా పట్టుదలగా కనిపిస్తోంది.
జీరో కోవిడ్ పాలసీలో భాగంగా ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లపై కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఆసియా క్రీడల వాయిదా వార్తలొచ్చినా.. చైనా అందుకు సిద్ధంగా లేదు. టోక్యో తరహాలోనే ఇక్కడా బయో బబుల్‌లోనే క్రీడలు నిర్వహించనున్నారు. భారత్ నుంచి క్రీడాకారులు, కోచింగ్ సిబ్బంది, అధికారులతో కలిసి 937 మందికి అనుమతి లభించినట్టు తెలుస్తోంది. చైనాలో అడుగుపెట్టిన క్రీడాకారులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి. లేదంటే చైనాలో అడుగుపెట్టిన తర్వాత 21 రోజుల క్వారంటైన్‌లోనైనా గడపాలి. క్వారంటైన్ సమయంలో ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ క్వారంటైన్ అనంతరమే క్రీడాకారులను క్రీడా గ్రామంలోకి అనుమతిస్తారు. క్రీడా గ్రామంలో సైతం అథ్లెట్లకు ప్రతి రోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి. క్లోజ్డ్-లూప్ వాతావరణంలో క్రీడల నిర్వహణకు నిర్వాహకులు ఇదివరకే ట్రయల్స్ చేశారు. ఆసియా క్రీడలకు వచ్చిన అథ్లెట్లతో స్థానిక ప్రజలు కలుసుకునే అవకాశం ఉండదు. క్రీడల సమయంలోనూ ప్రేక్షకుల గ్యాలరీపై సెక్యూరిటీ గార్డ్లు నిఘా ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికులను, అథ్లెట్లను కలువనివ్వరు. ఈ మేరకు నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నేడు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ సమావేశంలో క్రీడల నిర్వహణపై పూర్తి స్పష్టత రానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10-25న ఆసియా క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే.