Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ విజృంభణతో తప్పని తిప్పలు
- చైనా, హౌంగ్జౌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం
- హౌంగ్జౌ కొత్త తేదిల ప్రకటన త్వరలో : ఓసీఏ
ఆసియా అథ్లెట్లకు చేదు వార్త. కోవిడ్-19 భీకరంగా విజృంభించిన సమయంలోనే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించిన చైనా.. తాజాగా కోవిడ్-19 వేరియంట్ ఒమైక్రాన్ పంజాకు వెనుకడుగు వేసింది!. 2019లో కోవిడ్-19 వెలుగు చూసిన అనంతరం.. అక్కడ ఇప్పుడు కొత్త కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 10-25న ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన చైనా తాజా పరిస్థితుల నేపథ్యంలో క్రీడలను వాయిదా వేసింది. ఆసియా క్రీడల కొత్త షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
నవతెలంగాణ-బీజింగ్
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. రెండేండ్ల క్రితం ఊహకందని ప్రమాద ఘంటికలు మోగించి టోక్యో ఒలింపిక్స్ వాయిదాకు కారణమైన కోవిడ్-19 తాజాగా మరో అతిపెద్ద క్రీడా పండుగపై విరుచుకుపడింది!. చైనాలో ప్రస్తుతం కోవిడ్-19 ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఒమైక్రాన్ దెబ్బకు షాంఘై నగరం దాదాపుగా నెల రోజులుగా కఠిన లాక్డౌన్లో ఉంది. షాంఘై సమీప నగరం హౌంగ్జౌలోనే ఆసియా క్రీడలు నిర్వహించాల్సి ఉంది. శుక్రవారం జరిగిన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చైనా ఒలింపిక్ సంఘం (సీఓసీ), హౌంగ్జౌ ఆసియా క్రీడల నిర్వాహణ కమిటీ (హెచ్ఏజీఓసీ)లు తాజా పరిస్థితిపై ప్రజంటేషన్ ఇచ్చాయి. దీంతో ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్టు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్, చైనా ఒలింపిక్ సంఘం ఓ ప్రకటనలో తెలిపాయి. ఆసియా క్రీడల నిర్వహణ నిమిత్తం 56 ప్రపంచ శ్రేణి స్టేడియాలను, వేదికలను చైనా అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
వాయిదా అనివార్యం! : ' చైనీస్ ఒలింపిక్ కమిటీ (సీఓసీ), హౌంగ్జౌ ఆసియా క్రీడల నిర్వాహణ కమిటీ (హెచ్ఏజీఓసీ)లతో ఆసియా ఒలింపిక్ కమిటీ (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు (ఈబీ) సుదీర్ఘ మంతనాలు జరిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆసియా క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయించింది. చైనీస్ ఒలింపిక్ సంఘం, హౌంగ్జౌ ఆసియా క్రీడల నిర్వహణ కమిటీతో సంప్రదింపుల అనంతరం సెప్టెంబర్ 10-25న జరగాల్సిన ఆసియా క్రీడల కొత్త తేదిలను త్వరలోనే ప్రకటిస్తాం' అని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమైంది. కోవిడ్ పరిస్థితుల్లోనే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన చైనీస్ ఒలింపిక్ సంఘం (సీఓసీ) ఆసియా క్రీడలను సైతం అదే రీతిలో నిర్వహిస్తుందనే అంచనాలు ఉన్నాయి. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సైతం వాయిదా నిర్ణయాన్ని అంచనా వేయలేదు. బయో బబుల్ వాతావరణంలో క్లోజ్డ్ లూప్ పద్దతిలో ఆసియా క్రీడల నిర్వహణకు శుక్రవారం నాటి సమావేశంలో పచ్చజెండా ఊపుతారనే ఊహాగానాలే ఎక్కువగా వినిపించాయి. బయో బబుల్ వాతావరణంలో క్రీడల నిర్వహణకు జాతీయ చాంపియన్‌షిప్ టోర్నీలో ట్రయల్స్ సైతం నిర్వహించిన చైనా అధికారులు ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో కోవిడ్ కరతాళ నృత్యం చేస్తున్న తరుణంలో ఆసియా క్రీడల నిర్వహణ వాయిదా మంచిదని చైనా ఒలింపిక్ సంఘం అధికారులు భావించినట్టు తెలుస్తోంది.
మళ్లీ వీలు పడేనా?! : అంతర్జాతీయ స్పోర్ట్స్ క్యాలెండర్ చాలా బీజీగా ఉంది. 2023 అంతర్జాతీయ క్యాలెండర్ ఇప్పటికే నిండిపోయింది. 2024లో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే ఆరంభం అవుతుంది. దీంతో అన్ని క్రీడల్లోనూ అర్హత టోర్నీలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, వరల్డ్‌కప్‌లు ఉండనున్నాయి. ఆసియా క్రీడల వాయిదా నిర్ణయం పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం సాధించిన దేశం నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ అర్హత కోటాపై ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులోనే బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉంది. దీంతో కామన్వెల్త్ క్రీడలపై ఎటువంటి ప్రభావం ఉండబోదు. సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన క్రీడలను వాయిదా వేస్తే కనీసం ఆరు నెలల్లోపు లేదా ఆరు నెలల తర్వాతైనా ఏర్పాటు చేసేందుకు చైనీస్ ఒలింపిక్ సంఘం ప్రయత్నిస్తే క్యాలెండర్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. వచ్చే ఏడాది క్యాలెండర్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియలను దృష్టిలో ఉంచుకుని కొత్త తేదీలను ప్రకటించనున్నారు. రానున్న 3-4 నెలల్లో పరిస్థితులు సద్దుమణిగితే హౌంగ్జౌ ఆసియా క్రీడలను సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది. 44 దేశాల నుంచి 11 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు పాల్గొనే ఆసియా క్రీడలు ఒలింపిక్స్ అనంతరం అతిపెద్ద క్రీడా ఈవెంట్.
ఇదిలా ఉండగా, ఆసియా క్రీడల వాయిదాతో క్రికెట్ పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. 2014 ఆసియా క్రీడల్లో చివరగా క్రికెట్‌ను చేర్చారు. 2018 ఆసియా క్రీడల్లో క్రీడాంశాలను తగ్గించటంతో క్రికెట్‌కు తొలగించారు. ఎనిమిదేండ్ల అనంతరం క్రికెట్ మరోసారి ఆసియా క్రీడల్లో కనువిందు చేస్తుందనుకుంటే.. ఆసియా క్రీడలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఆసియా క్రీడల్లో భారత్ నుంచి సుమారు 937 మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారుల బృందం వెళ్లనున్న సంగతి తెలిసిందే.
భారత అథ్లెట్లపై ప్రభావం : ఆసియా క్రీడల వాయిదా నిర్ణయం భారత అథ్లెట్లపై పలు రకాలుగా ప్రభావం చూపనుంది. అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌కు వాయిదా నిర్ణయం కలిసి రానుండగా.. టెన్నిస్ స్టార్ సానీయా మీర్జాకు జాతీయ జెండాతో ఆసియా క్రీడల్లో పోటీపడే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో లేని సైనా నెహ్వాల్.. జాతీయ ట్రయల్స్‌కు సైతం దూరమైంది. దీంతో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ జట్టులో సైనాకు చోటు దక్కలేదు. ఇప్పుడు క్రీడలు వాయిదా పడటంతో అర్హత ప్రక్రియ సైతం మారనుంది. ఇది సైనా నెహ్వాల్‌కు అందివచ్చే అవకాశం. ఇప్పటికే వయసు మీద పడిన అథ్లెట్లకు ఈ నిర్ణయం మింగుడు పడదు!. ఆర్చర్ తరుణ్‌దీప్ రారుకి 38 ఏండ్లు. ఇటీవల ప్రపంచకప్‌లో పతకం సాధించిన తరుణదీప్ రారు ఆసియా క్రీడల్లో వీడ్కోలు తీసుకోవాలని అనుకున్నాడు. తాజా పరిణామంతో రారుకు ఎటు తోచని దుస్థితి. 2018 జకర్తా క్రీడల్లో పతకాలు సాధించిన సీనియర్ అథ్లెట్లు సీమా పూనియా (డిస్కస్ త్రో), మంజిత్ సింగ్ (800 మీ), జిన్సన్ జాన్సన్ (1500 మీ), ఎంఆర్ పూవమ్మ (రిలే రేసు)ల సన్నద్ధతను వాయిదా దెబ్బతీయనుంది. ఇక ఆర్థికంగానూ ప్రభుత్వానికి ఇది గట్టి దెబ్బ. ఆసియా క్రీడల వాయిదాతో టాప్ క్రీడాకారులకు, పోటీపడే అథ్లెట్లకు ప్రభుత్వం శిక్షణకు ఆర్థిక సాయం చేస్తోంది. తాజా పరిస్థితుల్లో ఆసియా క్రీడలకు అందించే ఆర్థిక సాయాన్ని మరింత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. ఇది క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక ప్రణాళికలను తలకిందులు చేయనుంది.