Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయల్స్ ఖాతాలో ఏడో విజయం
- పంజాబ్ కింగ్స్‌కు తప్పని భంగపాటు
- రాణించిన యశస్వి జైస్వాల్, హెట్మయర్
ఐపీఎల్ 15 ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసింది. సీజన్లో ఏడో విజయం నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో చోటు ఖాయం చేసుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది!. తాజా సీజన్లో ఛేదనలో రాయల్స్‌కు తొలి విజయం లభించగా.. పంజాబ్ కింగ్స్ ఓ మ్యాచ్‌లో గెలుపు, మరో మ్యాచ్‌లో ఓటమి ట్రెండ్‌కు కొనసాగిస్తోంది. 190 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది.
నవతెలంగాణ-ముంబయి
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (68, 41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రెచ్చిపోయాడు. ఆరంభంలో వైఫల్యంతో తుది జట్టుకు దూరమైన జైస్వాల్ చివరి అంకంలో అవకాశం దక్కగానే దుమ్మురేపాడు. 190 పరుగుల ఛేదనలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో శివమెత్తిన జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక భూమిక వహించాడు. షిమ్రోన్ హెట్మయర్ (31 నాటౌట్, 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివర్లో తనదైన మెరుపులతో దండెత్తగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్లో రాయల్స్ ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (56, 40 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ బాదాడు. జితేశ్ శర్మ (38 నాటౌట్, 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రాయల్స్ స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ (3/28) మూడు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఛేదనలో గెలుపు ఇన్నింగ్స్ నమోదు చేసిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
దంచికొట్టిన జైస్వాల్ : 20, 1, 4.. ఐపీఎల్15లో తొలి మూడు మ్యాచ్‌ల్లో యశస్వి జైస్వాల్ ప్రదర్శన ఇది. రిటెయిన్డ్ ఆటగాడిగా జైస్వాల్ ప్రదర్శన నిరాశపరిచింది. ఆ తర్వాత వరుసగా ఏడు మ్యాచుల్లో బెంచ్‌కు పరిమితం అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తిరిగి ఓపెనర్‌గా తుది జట్టులోకి వచ్చిన జైస్వాల్ వచ్చీ రాగానే దండెత్తాడు. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే సందీప్ శర్మను ఉతికారేశాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో శివమెత్తాడు. మరో ఎండ్‌లో కగిసో రబాడను జోశ్ బట్లర్ (30, 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టార్గెట్ చేశాడు. రబాడపై ఓ సిక్సర్, మూడు ఫోర్లు బాదిన బట్లర్ చివరి బంతిని సైతం బౌండరీకి మలిచేందుకు ప్రయత్నించాడు. విలక్షణ షాట్‌తో స్లిప్స్‌లో దొరికిపోయిన బట్లర్.. పవర్‌ప్లేలో ముగియకముందే డగౌట్‌కు చేరుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (23, 12 బంతుల్లో 4 ఫోర్లు) నాలుగు బౌండరీలతో రన్‌రేట్‌ను దూకుడుగానే కొనసాగించాడు. సంజు నిష్క్రమణ అనంతరం దేవదత్ పడిక్కల్ (31, 32 బంతుల్లో 3 ఫోర్లు) పరుగుల వేటలో ఇబ్బంది పడటంతో రాయల్స్‌పై ఒత్తిడి పడింది. మరో వైపు యశస్వి జైస్వాల్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. జైస్వాల్ ఇన్నింగ్స్‌తో రాయల్స్ రేసులోనే నిలబడింది. అర్థ సెంచరీ అనంతరం యశస్వి వికెట్ కోల్పోగా.. ఆ తర్వాత ఛేదన బాధ్యతలను షిమ్రోన్ హెట్మయర్ (31 నాటౌట్) చూసుకున్నాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టిన హెట్మయర్ ఛేదనను సులువుగా మార్చాడు. డెత్ ఓవర్లలో పరుగులు చేసేందుకు పడిక్కల్ నానా తంటాలు పడ్డాడు. పడిక్కల్ ఇన్నింగ్స్‌తో రాయల్స్ మ్యాచ్‌ను కోల్పోతుందనే అంచనాలు కనిపించాయి. కానీ హెట్మయర్ బిగ్ హిట్టింగ్తో మ్యాచ్‌ను రాయల్స్ పరం చేశాడు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఉత్కంఠ తొలగించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబాడ (1/50), సందీప్ శర్మ (0/41) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అర్షదీప్ సింగ్ (2/29) రెండు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు.
చాహల్ మ్యాజిక్ : టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ (12) ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. జానీ బెయిర్‌స్టో (56) అర్థ సెంచరీతో చెలరేగాడు. బ్యాటింగ్ లైనప్‌లో ముందుకొచ్చిన జానీ బెయిర్‌స్టో సత్తా చాటాడు. 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు పిండుకున్నాడు. భానుక రాజపక్సె (27, 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బెయిర్‌స్టోతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోన్న తరుణంలో మాయగాడు యుజ్వెంద్ర చాహల్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో మయాంక్ అగర్వాల్ (15), జానీ బెయిర్‌స్టోను అవుట్ చేసిన పంజాబ్ కింగ్స్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. యువ బ్యాటర్ జితేశ్ శర్మ (38 నాటౌట్, 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లియాం లివింగ్‌స్టోన్ (22, 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించటంతో పంజాబ్ కింగ్స్ 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : జానీ బెయిర్‌స్టో (ఎల్బీ) చాహల్ 56, శిఖర్ ధావన్ (సి) బట్లర్ (బి) అశ్విన్ 12, భానుక రాజపక్స (బి) చాహల్ 27, మయాంక్ అగర్వాల్ (సి) బట్లర్ (బి) చాహల్ 15, జితేశ్ శర్మ నాటౌట్ 38, లియాం లివింగ్‌స్టోన్ (బి) ప్రసిద్ కృష్ణ 22, రిశి ధావన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 189.
వికెట్ల పతనం : 1-47, 2-89, 3-118, 4-119, 5-169.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-1-36-0, ప్రసిద్ కృష్ణ 4-0-48-1, కుల్దీప్ సేన్ 4-0-42-0, రవిచంద్రన్ అశ్విన్ 4-0-32-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-28-3.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) అర్షదీప్ సింగ్ 68, జోశ్ బట్లర్ (సి) రాజపక్స (బి) కగిసో రబాడ 30, సంజు శాంసన్ (సి) శిఖర్ ధావన్ (బి) రిషి ధావన్ 23, దేవదత్ పడిక్కల్ (సి) అగర్వాల్ (బి) అర్షదీప్ సింగ్ 31, షిమ్రోన్ హెట్మయర్ నాటౌట్ 31, రియాన్ పరాగ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం :(19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 190.
వికెట్ల పతనం : 1-46, 2-85, 3-141, 4-182.
బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-41-0, కగిసో రబాడ 4-0-50-1, అర్షదీప్ సింగ్ 4-0-29-2, రిషి ధావన్ 3-0-25-1, రాహుల్ చాహర్ 3.4-0-39-0, లియాం లివింగ్‌స్టోన్ 1-0-6-0.