Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బెంగళూర్‌తో కీలక పోరు
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. గెలుపు బాట పట్టి ప్లే ఆఫ్స్‌లో చోటుపై కన్నేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు తలపడనుంది. బెంగళూర్‌పై గత మ్యాచ్‌లో ఏకపక్ష విజయం నమోదు చేసిన హైదరాబాద్.. గత మూడు మ్యాచుల్లో వరుస పరాజయాలు చవిచూసింది. సీజన్ ఆరంభంలో రెండు ఓటముల నుంచి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించిన హైదరాబాద్.. తాజాగా అదే స్ఫూర్తితో గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.
కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఆందోళనగా మారగా.. బెంగళూర్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్ బెంగ పట్టుకుంది. సన్‌రైజర్స్ సారథి పది మ్యాచుల్లో 199 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌రేట్ 96.13. ఐపీఎల్15లో ఇదే అత్యంత స్వల్పం. మరోవైపు విరాట్ కోహ్లి 11 మ్యాచుల్లో 21.60 సగటుతో 216 పరుగులు చేశాడు. కోహ్లి స్ట్రయిక్‌రేట్ 111.9. కేన్ విలియమ్సన్ కంటె కాస్త మెరుగ్గా కోహ్లి ఉన్నాడు. గత మ్యాచ్‌లో బెంగళూర్‌ను వణికించిన మార్కో జాన్సెన్ వరుస వైఫల్యాలతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. నేటి మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వస్తాడేమో చూడాలి. గాయపడిన వాషింగ్టన్ సుందర్ సైతం నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు!. నికోలస్ పూరన్ వరుస అర్థ సెంచరీలతో ఫామ్‌లోకి రావటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం కాగా.. గత మ్యాచుల్లో వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బౌలింగ్ విభాగం రెట్టించిన ఉత్సాహంలో కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎడెన్ మార్కరం, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్/ మార్కో జాన్సెన్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రాజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోశ్ హజిల్‌వుడ్.