Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీపై 5-0తో ఏకపక్ష విజయం
- కెనడాపై అమ్మాయిల పైచేయి
- థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్ (థాయ్‌లాండ్) : థామస్, ఉబెర్ కప్‌లో టీమ్ ఇండియా జోరు జోష్‌తో మొదలైంది. థామస్ కప్ చరిత్రలో ఎన్నడూ సెమీఫైనల్స్‌కు చేరుకోని భారత పురుషుల జట్టు.. ఈ సారి బ్యాంగ్ బ్యాంగ్‌తో వేట మొదలుపెట్టింది. థామస్ కప్ గ్రూప్ దశలో గ్రూప్-సిలో జర్మనీపై భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. మెన్స్ జట్టు సమిష్టిగా దుమ్మురేపటంతో 5-0తో టీమ్ ఇండియా ఏకపక్ష విజయం నమోదు చేసింది. మరో వైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సేవలు లేకపోయినా అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేశారు. గ్రూప్-డిలో కెనాడాపై సాధికారిక విజయం నమోదు చేశారు. ఉబెర్ కప్‌లో శుభారంభం గావించారు.
థామస్ కప్ గ్రూప్-సిలో పరుషుల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నం.9 లక్ష్యసేన్ అలవోక విజయంతో వేట షురూ చేశాడు. 21-16, 21-13తో 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. తొలి డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మూడు గేముల్లో పోరాడి గెలిచారు. 21-15, 10-21, 21-13తో గంట పాటు సాగిన ఉత్కంఠ పోరులో పైచేయి సాధించి ఆధిక్యం 2-0కు తీసుకెళ్లాడు. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ మెరిశాడు. 18-21, 21-9, 21-11తో మూడు గేముల్లో గెలుపొందాడు. ఇక్కడితో 3-0తో జర్మనీపై భారత్ గెలుపు సాధించింది. ఆధిక్యం కోసం జరిగిన చివరి రెండు మ్యాచుల్లో భారత్ జోరు తగ్గలేదు. రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఎంఆర్ అర్జున్ దృవ్ కపిల 25-23, 21-15తో గెలుపొందగా.. మూడో సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణరు 21-9, 21-9తో చెమట పట్టకుండా విజయం సాధించాడు. జర్మనీపై 5-0తో గెలుపొందిన భారత్ గ్రూప్-సిలో అగ్రస్థానానికి గట్టి అడుగు వేసింది!.నేడు థామస్ కప్‌లో గ్రూప్-సిలో కెనడాతో భారత్ తలపడనుంది. ఇక, ఉబెర్ కప్‌లో మహిళలు సైతం అద్భుతంగా రాణించారు. అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు 21-17, 21-10తో మిచెలీ లీపై గెలుపొందింది. 33 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో ఒలింపిక్ మెడలిస్ట్‌కు ఎదురులేకుండా పోయింది. తొలి గేమ్‌లో పోటీనిచ్చిన మిచెలీ లీ రెండో గేమ్‌లో పూర్తిగా తేలిపోయింది. తొలి డబుల్స్‌లో శృతి మిశ్రా, సిమ్రన్ సింఘీ 19-21, 12-21తో పోరాడి ఓడారు. రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఆకార్షి కశ్యప్ 17-21, 21-18, 21-17తో వెనఖ్ యు జాంగ్‌పై ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 2-1కు చేరుకుంది. రెండో డబుల్స్ మ్యాచ్‌లో తనీశ, త్రిష జోడీ 21-9, 21-15తో అలవోక విజయం నమోదు చేశారు. దీంతో 3-1తో కెనడాపై భారత్ విజయం లాంఛనం చేసుకుంది. అంచనాలు లేకుండా బరిలోకి మహిళల జట్టు ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. గ్రూప్ దశలో రానున్న కీలక మ్యాచుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం తోడ్పడనుంది.