Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తికరంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు
- గుజరాత్, లక్నోలకు లైన్ క్లియర్
- రాజస్థాన్, బెంగళూర్‌లకు మంచి ఛాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లే ఆఫ్స్ రేసు సహజంగానే రక్తి కడుతోంది. తాజా సీజన్లో పది జట్లు పోటీపడుతున్నాయి. దీంతో టాప్-4 స్థానాలకు పోటీ మరింత అధికంగా ఉంది. లీగ్ దశ ఆట చివరి అంకానికి చేరుకుంటున్న దశలో ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్లపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఐపీఎల్ అగ్రజట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఈ సీజన్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించనుండగా.. కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ టాప్-4లో చోటు ఖాయం చేసుకోవటం గమనార్హం. ఐపీఎల్ 15 ప్లే ఆఫ్స్ రేసులో ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయి? టాప్-4లో నిలిచేందుకు మెరుగైన అవకాశం ఉన్న జట్లు ఏవో చూద్దాం.
లక్నో సూపర్‌జెయింట్స్
కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్స్ అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. జాతీయ జట్టు తరఫున చెత్త కెప్టెన్సీ రికార్డుతో ఐపీఎల్‌లోకి వచ్చిన రాహుల్ అద్భుత ఫలితాన్ని అందుకున్నాడు!. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 75 పరుగుల తేడాతో గెలుపొందిన లక్నో నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుని అగ్రస్థానంలోకి వచ్చింది. లీగ్ దశలో 11 మ్యాచులు ఆడిన లక్నో సూపర్‌జెయింట్స్ 8 విజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. చివరి మూడు మ్యాచుల్లో కనీసం ఓ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్‌జెయింట్స్ టాప్-4లో నిలువటం ఖాయం. మూడు మ్యాచుల్లో ఓడినా ఇతర సమీకరణాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు సైతం మెరుగైన అవకాశమే ఉంది. చివరి మూడు మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఎదుర్కొవాల్సి ఉంది. వీటిల్లో చెన్నై, గుజరాత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. మూడింటా విజయాలు నమోదు చేసి టాప్-2 పొజిషన్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని లక్నో భావిస్తోంది.
గుజరాత్ టైటాన్స్
9 మ్యాచుల్లో 8 విజయాలతో ఎదురులేని జోరుమీద కనిపించిన గుజరాత్ టైటాన్స్ చివరి రెండు మ్యాచుల్లో పరాజయం పొందింది. ఓ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, మరో మ్యాచ్‌లో చేజేతులా ఛేదనను క్లిష్టం చేసుకుంది. ముంబయితో మ్యాచ్‌లో అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను గుజరాత్ అనూహ్యంగా కోల్పోయింది. 11 మ్యాచుల్లో 8 విజయాలతో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచుల్లో కనీసం ఓ విజయం సాధిస్తే గుజరాత్ విజిలేస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మూడింటా ఓడినా.. టైటాన్స్ టాప్-4 ఆశలకు పెద్దగా ప్రమాదం లేదనే చెప్పాలి!. క్వాలిఫయర్‌లో ఆడటంపై కన్నేసిన గుజరాత్ టైటాన్స్ చివరి మూడు మ్యాచుల్లో లక్నో సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో పోటీపడ నుంది. లక్నో, బెంగళూర్లు టాప్-4లో రేసులో ఉండటంతో ఈ రెండు మ్యాచుల్లోనూ టైటాన్స్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైనా.. చివరి క్షణం వరకూ అన్ని అవకాశాలను అన్వేషిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో పోరు సైతం పాండ్యసేన పరేషాన్ కానుంది!.
రాజస్థాన్ రాయల్స్
సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ ఆరంభం నుంచీ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. జోశ్ బట్లర్ పరుగుల వేటలో ముందంజలో ఉండగా.. యుజ్వెంద్ర చాహల్ వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. ఛేదనలోనూ ఓ విజయం సాధించిన రాయల్స్ గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకునే సరికి మరింత ప్రమాదకర జట్టుగా తయారైంది. లీగ్ దశలో చివరి మూడు మ్యాచుల్లో కనీసం రెండు మ్యాచుల్లో విజయాలు రాజస్థాన్ రాయల్స్ టాప్-4 ఆశలకు ఊపిరీ పోయనున్నాయి. సహజంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ పొజిషన్ కోసం 16 పాయింట్లు సాధిస్తే సరిపోతుంది. కానీ ఇతర సమీకరణాలతో సైతం సంబంధం లేకుండా నేరుగా చేరుకునేందుకు 18 పాయింట్లు బెంచ్ మార్క్. చివరి మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్కింగ్స్లను రాజస్థాన్ రాయల్స్ ఎదుర్కొవాల్సి ఉంది. కనీసం ఒక్క విజయం సాధించినా నెట్ రన్‌రేట్ అండతో రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో నిలిచేందుకు అవకాశం మెండుగా ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
'ఈ సారి కప్పు మనదే' అంటూ లీగ్ దశలో అద్వితీయ ఆటతో రెచ్చిపోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఈ సీజన్‌ను కాస్త భిన్నంగా మొదలెట్టింది. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి సీజన్లో దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. స్టార్ క్రికెటర్లు సైతం పెద్దగా మెరవటం లేదు. అయినా, పడుతూ లేస్తూ ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూర్. 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చివరి రెండు మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. ఓ మ్యాచ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓడితే డుప్లెసిస్ సేన ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. రెండింటా ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. చివరి రెండు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పోటీపడాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్
వరుసగా రెండు సీజన్లు అద్భుత ప్రదర్శన చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తాజా సీజన్లో అంచనాలను అందుకోలేదు. లీగ్ దశలో 11 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదింట విజ యాలు నమోదు చేసింది. ఆరు మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. మిగిలిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లు సాధిస్తుంది. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం 16 పాయింట్లు సరిపోతాయి. విజ యాలతో పాటు కాస్తో కూస్తో నెట్ రన్‌రేట్ సైతం పెరుగు తుంది కాబట్టి.. పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే, మూడింట ఏ ఒక్క మ్యాచ్‌లో పరాజయం చవిచూసినా ఢిల్లీ క్యాపిటల్స్‌కు భంగపాటు తప్పదు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సి ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
సీజన్ ఆరంభంలో ఖేల్ ఖతమని అనిపించగా.. మూడో మ్యాచ్ నుంచీ టాప్-4లో హైదరాబాద్‌కు చోటు పక్కా అనిపించింది. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ మొదటికొచ్చింది. వరుసగా ఐదు విజయాల అనంతరం హైదరాబాద్ వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసింది. టాప్-4లో చోటును క్లిష్టతరం చేసుకుంది. 11 మ్యాచుల్లో ఐదు విజయాలు నమోదు చేసిన హైదరాబాద్.. మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. చివరి మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధిస్తే 16 పాయింట్లతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కోల్‌కత నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌లతో సన్‌రైజర్స్ చివరి మూడు మ్యాచుల్లో తలపడనుంది. మూడింట ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడినా హైదరాబాద్ కథ కంచికి చేరటం ఖాయం.
పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కథ ఇంచుమించుగా సన్‌రైజర్స్ మాదిరిగానే ఉంది. ఓ మ్యాచ్‌లో విజయం, మరో మ్యాచ్‌లో ఓటమి. ఇదీ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రస్థానం. కొత్త కెప్టెన్ మయాంక్ అగర్వాల్, పాత కోచ్ అనిల్ కుంబ్లే కాంబినేషన్ పంజాబ్ కింగ్స్‌లో పెద్ద మార్పులు తేలకపోయింది!. 11 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ ఐదు విజయాలు సాధించింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూర్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్‌తో చివరి మూడు మ్యాచుల్లో విజయాలు సాధిస్తే పంజాబ్ కింగ్స్ ముందుకెళ్లే అవకాశం ఉంది. లేదంటే, మరో సీజన్‌ను లీగ్ దశ నుంచే ముగించనుంది!.
కోల్‌కత, చెన్నై, మంబయి!
కోల్‌కత నైట్‌రైడర్స్ 11 మ్యాచుల్లో 4 విజయాలు నమోదు చేసింది. మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ముంబయి, హైదరాబాద్, లక్నోలపై చివరి మ్యాచుల్లో విజయాలు సాధించినా ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లు సాధించగల్గుతుంది. ఇదే సమయంలో ఇతర జట్ల ఫలితాలు సైతం కోల్‌కతకు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే అదృష్టం కలిసివచ్చి కోల్‌కత టాప్-4లో నిలువగలదు. లేదంటే ఆ జట్టు కథ ఈ సీజన్‌కు ముగిసినట్టే!. చెన్నై సూపర్‌కింగ్స్ పరిస్థితి సైతం ఇదే. 11 మ్యాచుల్లో నాలుగు విజయాలే సాధించింది. చివరి మూడు మ్యాచుల్లో భారీ విజయాలు సహా ఇతర మ్యాచుల ఫలితాలు అనుకూలంగా ఉంటే తప్పితే అవకాశాలు లేవు. 10 మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన ముంబయి ఇండియన్స్ మరో నాలుగు మ్యాచులు ఆడనుంది. కోల్‌కత, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలపై గెలుపొందినా ఆ జట్టుకు 12 పాయింట్లే అవుతాయి. అధికారికంగా ముంబయి ఇండియన్స్ మాత్రమే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్లో ఏ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. ఈ రోజు ఓ జట్టుకు అనుకూలంగా కనిపించిన సమీకరణాలు వరుస మ్యాచుల వైఫల్యంతో తలకిందులు అవుతుంది. అందుకే, చివరి లీగ్ మ్యాచ్ పూర్తయ్యేవరకు ప్లే ఆఫ్స్ రేసులో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం!.