Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయిలు అదరగొట్టారు. ఉబెర్ కప్ ఫైనల్స్‌లో అంచనాలను తలకిందులు చేశారు. గ్రూప్ దశలో వరుసగా రెండు తిరుగులేని విజయాలతో ఉబెర్ కప్ ఫైనల్స్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లేని భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందనే వ్యాఖ్యలు వినిపించాయి. సింధు సారథ్యంలోని యువ షట్లర్లు అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. ఉబెర్ కప్‌లో నాకౌట్ దశలోకి అడుగుపెట్టారు. మెన్స్ జట్టు సైతం క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
- క్వార్టర్ఫైనల్లో టీమ్ ఇండియా
- ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్
నవతెలంగాణ-బ్యాంకాక్
ఉబెర్ కప్ ఫైనల్స్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టుకు మంచి రికార్డు ఉంది. అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్ ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉన్న సమయంలో భారత్ రెండు పతకాలు కొల్లగొట్టింది. 2014, 2016 ఉబెర్ కప్ ఫైనల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుని కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. పలు కారణాలతో ఈ ఏడాది ఉబెర్ కప్ జట్టులో సైనా నెహ్వాల్‌కు చోటు దక్కలేదు. మహిళల జట్టులో పి.వి సింధు ఒక్కరే చెప్పుకోదగిన షట్లర్. సింగిల్స్, డబుల్స్ విభాగంలో వర్థమాన షట్లర్లు. అంతర్జాతీయ వేదికపై ఇంకా నిరూపించుకోవాల్సిన క్రీడాకారిణులే. ఈ దశలో యువ జట్టును పి.వి సింధు గొప్పగా నడిపించింది. గ్రూప్ దశలో వరుసగా రెండో విజయంతో మహిళల జట్టును క్వార్టర్ఫైనల్స్కు చేర్చింది. మంగళవారం జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 4-1తో గెలు పొందింది. తొలి మ్యాచ్‌లో కెనడాను 4-1తో ఓడించిన భారత్ వరుసగా రెండో విజయంతో గ్రూప్‌లో టాప్-2 స్థానం ఖాయం చేసుకుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో అగ్ర జట్టు దక్షిణ కొరియాతో భారత్ తలపడనుంది. దక్షిణ కొరియాతో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టీమ్ ఇండియా ఇప్పటికే నాకౌట్ బెర్త్ సొంతం చేసుకుంది.
సింధు నడిపించగా..!
ఉబెర్ కప్ గ్రూప్-డిలో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అంచనాలు లేని జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. 4-1తో అమెరికాను చిత్తు చేసింది. స్టార్ షట్లర్ పి.వి సింధు మరోసారి తొలి మ్యాచ్‌లోనే తిరుగులేని విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. తొలి సింగిల్స్‌లో 21-10, 21-11తో సింధు అలవోక విజయం సాధించింది. 26 నిమిషాల్లోనే వరుస గేముల మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండు గేముల్లోనూ సింధుకు అమెరికా షట్లర్ జెన్నీ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. చెమట పట్టకుండా పాయింట్లు సాధించిన సింధు భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. తొలి డబుల్స్‌లో తనీశ, త్రిష జంట సైతం మెరిసింది. 21-19, 21-10తో వరుస గేముల్లోనే ఫ్రాన్సిసా, అలిసన్ లీ జోడీపై గెలుపొందింది. 34 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో భారత జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌లో పోటీనిచ్చిన అమెరికా జంట.. రెండో గేమ్‌లో పూర్తిగా తేలిపోయింది. దీంతో భారత్ ఆధిక్యం 2-0కు మెరుగైంది. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ అదరగొట్టింది. 21-18, 21-11తో వరుస గేముల్లోనే విజయం సాధించింది. ఎస్తర్ షిపై అలవోక విజయం నమోదు చేసింది. తొలి గేమ్‌లో కాస్త చెమటోడ్చిన ఆకర్షి రెండో గేమ్‌లో దూకుడుగా ఆడింది. ఏకపక్ష విజయం ఖాతాలో వేసుకుంది. ఆకర్షి కశ్యప్ విజయంతో భారత్ ఆధిక్యం 3-0కు చేరుకుంది. చివరి రెండు మ్యాచ్ ఫలితాలతో నిమిత్తం లేకుండా అమెరికాపై విజయం సొంతం చేసుకుంది. రెండో డబుల్స్ మ్యాచ్‌లో అమెరికాకు ఊరట లభించింది. మూడు గేముల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో అమెరికా జోడీ లారెన్, టాంగ్ లీలు గెలుపొందారు. 12-21, 21-17, 13-21తో సిమ్రన్ సింగ్, రితిక జోడీ 44 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పోరాడి ఓడారు. నామమాత్రపు ఐదో మ్యాచ్‌లో సింగిల్స్ షట్లర్ ఆస్మిత చాలిహ మెరుపు విజయం సాధించింది. 21-18, 21-13తో 31 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. నటాలీ చి రెండు గేముల్లోనూ పోటీ ఇవ్వలేకపోయింది. అస్మిత జోరుతో భారత్ 4-1తో అమెరికాపై తిరుగులేని విజయం నమోదు చేసింది. గ్రూప్-డి నుంచి టాప్-2 స్థానం ఖాయం చేసుకుని నాకౌట్లోకి ప్రవేశించింది. నేడు జరిగే కీలక గ్రూప్-డి పోరులో దక్షిణ కొరియాతో సింధుసేన తాడోపేడో తేల్చుకోనుంది. నాకౌట్ దశలో కఠిన ప్రత్యర్థులు ఎదురు కానున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా వాస్తవ బలం ఏమిటో పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా నాకౌట్ దశలో మెరుగైన మ్యాచ్ ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సరికొత్త వ్యూహ రచనకు అవకాశం ఏర్పడనుంది.
అగ్రస్థానంపై కన్నేసి..! :
మరోవైపు థామస్ కప్‌లో టీమ్ ఇండియా కుర్రాళ్లు అగ్రస్థానంపై కన్నేశారు. థామస్ కప్ చరిత్రలో ఎన్నడూ పతకం సాధించిన భారత పురుషుల జట్టు ఈ ఏసారి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. గ్రూప్ దశలో వరుసగా జర్మనీ, కెనడాలపై భారత్ 5-0తో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-సిలో భారత్‌కు ప్రధాన ప్రత్యర్థి చైనీస్ తైపీ. ఫైనల్లో పోటీపడేందుకు సన్నద్ధమవుతున్న టీమ్ ఇండియా తొలుత గ్రూప్ దశలో చైనీస్ తైపీని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గ్రూప్ దశలో చైనీస్ తైపీ సైతం రెండు మ్యాచుల్లో రెండు విజయాలు నమోదు చేసింది. నేడు భారత్, చైనీస్ తైపీ మ్యాచ్‌లో విజేత గ్రూప్-సి నుంచి అగ్రస్థానం దక్కించుకోనుంది. నాకౌట్ దశలో (క్వార్టర్ఫైనల్లో) తేలికైన ప్రత్యర్థితో తలపడేందుకు గ్రూప్ దశలో అగ్రస్థానం కీలకం కానుంది. వరల్డ్ నం.9 లక్ష్యసేన్, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరులు సింగిల్స్ విభాగంలో భీకర ఫామ్‌లో ఉన్నారు. డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. దీంతో నేడు చైనీస్‌తైపీతో మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.