Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదానికి దారితీస్తున్న కోల్‌కత వ్యవహారం
ముంబయి : కోల్‌కత నైట్‌రైడర్స్ శిబిరం సరికొత్త చర్చకు, కొత్త వివాదానికి తెరతీసింది!. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండుసార్లు చాంపియన్ ఈ సీజన్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ 15లో కోల్‌కత నైట్‌రైడర్స్ తుది జట్టు ఎంపికలో మార్పులు, చేర్పుల్లోనే నిలకడ చూపించింది. లీగ్ దశలో 12 మ్యాచులు ఆడిన కోల్‌కత నైట్‌రైడర్స్ ఐదు విజయాలు సాధించింది. చివరి రెండు మ్యాచుల్లో గెలుపొందినా ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఇతర సమీకరణాలు కలిసి రావాల్సి ఉంది. తాజాగా ముంబయి ఇండియన్స్‌పై 52 పరుగుల తేడాతో గెలుపొందిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. కోల్‌కత నైట్‌రైడర్స్ తుది జట్టు ఎంపికపై టీమ్ ఇండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా పదునైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ క్లాస్ పేసర్ పాట్ కమిన్స్‌ను బెంచ్‌కు పరిమితం చేయటం పట్ల రవిశాస్త్రి నైట్‌రైడర్స్ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తాడు. కోల్‌కత తుది జట్టు ఎంపికలో ప్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ సైతం జోక్యం చేసుకుంటున్న విషయాన్ని అయ్యర్ తాజాగా ముంబయితో మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ' తుది జట్టులో మార్పులు చేర్పులు ఇబ్బందితో కూడిన పని. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో నేను అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాను. తుది జట్టు ఎంపికపై కోచ్‌తో చర్చిస్తాను. జట్టు సీఈఓ సైతం జట్టు ఎంపికలో భాగస్వామ్యం అవుతారు. ఏ ఆటగాడినైనా తుది జట్టు నుంచి తప్పించాల్సి వస్తే హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆ విషయాన్ని ఆటగాళ్లకు తెలియజేస్తారు. జట్టులోని ఆటగాళ్లు అందరూ తుది జట్టులో నిలిచినప్పుడు మైదానంలో పూర్తి స్థాయి మద్దతుగా నిలువటం కెప్టెన్‌గా గర్వకారణం' అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. తుది జట్టు ఎంపిక పూర్తి జట్టు మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా కోచ్‌లు చర్చించి పరిస్థితులు, ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసి తుది జట్టును ఎంపిక చేస్తారు. ఈ విషయంలో క్రికెటేతర విభాగానికి చెందిన సీఈఓ జోక్యం చేసుకోవటంపై పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గతంలో కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలోనూ తుది జట్టు ఎంపిక అంశాలను ప్రాంఛైజీ యాజమాన్యంతో చర్చించి ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. మరోసారి కోల్‌కత నైట్‌రైడర్స్ తుది జట్టు ఎంపికలో సరికొత్త చర్చకుత కారణమైంది.