Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కత కోచ్ పదవికి రాజీనామా!
ముంబయి: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఐపీఎల్ ప్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్ చీఫ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్లో కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు బ్రిటన్ మీడియా వార్త కథనాలు ప్రచురించింది. ఐపీఎల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మెక్కల్లమ్ ఈ సీజన్ అనంతరం కోల్‌కత బాధ్యతలకు రాజీనామా చేయనున్నాడు. ఈ విషయాన్ని కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టు సమావేశంలో బ్రెండన్ మెక్కల్లమ్ వెల్లడించినట్టు సమాచారం. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రినిబాగో నైట్‌రైడర్స్‌కు సైతం మెక్కల్లమ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. 'కొద్దిరోజుల కిందట నైట్‌రైడర్స్ జట్టు సమావేశంలో ప్రాంఛైజీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు మెక్కల్లమ్ తెలిపాడు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా కొత్త బాధ్యతలు తీసుకోబుతున్న విషయాన్ని సైతం మెక్కల్లమ్ జట్టు సభ్యులతో పంచుకున్నాడు' అని నైట్‌రైడర్స్ శిబిరంలోని ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు. యాషెస్ టెస్టు సిరీస్‌లో 0-4తో కోల్పోయిన అనంతరం కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేయగా.. పాల్ కాలింగ్‌వుడ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. జో రూట్ కెప్టెన్సీకీ రాజీనామా చేయటంతో బెన్ స్టోక్స్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు బ్రెండన్ మెక్కల్లమ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. మెక్కల్లమ్ సూచనలతో మోర్గాన్‌ను కోల్‌కత కెప్టెన్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌లో పుట్టిన బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా ఎంపిక కాగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్‌గా నియామకం కానుండటం విశేషం. మెక్కల్లమ్ టెస్టులతో పాటు వైట్‌బాల్ జట్టుకు సైతం కోచ్‌గా ఉంటాడా? లేదా అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంగ్లాండ్ కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ తొలి సిరీస్‌లోనే కఠిన సవాల్ ఎదురుకానుంది. జూన్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌తో మెక్కల్లమ్ కోచ్ ప్రస్థానం ప్రారంభం కానుంది.