Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో మార్ష్, వార్నర్ అర్థ సెంచరీలు
- రాజస్థాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
నవతెలంగాణ-ముంబయి: రాజస్థాన్ రాయల్స్ కీలక తరుణంలో ఓ పరాజయం చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారగా రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. మిచెల్ మార్ష్ (89, 62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు),డెవిడ్ వార్నర్ ( 52 నాటౌట్, 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరి మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ అలవోక విజయం నమోదు చేసింది. అంతకముందు, ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (50, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పించ్ హిట్టర్‌గా అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగులతో చెలరేగిన అశ్విన్ టీ20 ఫార్మాట్లో తొలి అర్థ సెంచరీ సాధించాడు. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (48, 30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చేతన్ సకారియ, ఎన్రిచ్ నోకియా, మిచెల్ మార్ష్‌లు రెండేసి వికెట్లతో రాజస్థాన్ రాయల్స్‌ను కట్టడి చేశారు. ఛేదనలో చెలరేగిన మిచెల్ మార్ష్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఆ ఇద్దరు మెరువగా..: టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆరెంజ్ క్యాప్ బ్యాటర్ జోశ్ బట్లర్ (7, 11 బంతుల్లో 1 ఫోర్) పవర్‌ప్లేలోనే నిష్క్రమించటంతో రాజస్థాన్ భారీ స్కోరు ఆశలకు గండి పడింది. 11 బంతులు ఎదుర్కొన్న బట్లర్ బౌండరీల వేటలో తడబడ్డాడు. చేతన్ సకారియ బౌలింగ్‌లో మిడాన్‌లో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. బట్లర్ నిష్క్రమణతో పించ్ హిట్టర్‌గా క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (50) రాయల్స్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పరుగుల వేట కష్టతరమైన తరుణంలో అశ్విన్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్థ సెంచరీ నమోదు చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19, 19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో సౌకర్యవంతంగా కదల్లేదు. దేవదత్ పడిక్కల్ (48)తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసిన అశ్విన్.. రాయల్స్‌ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. గత మ్యాచ్‌లో తడబడిన పడిక్కల్ ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (6), రియాన్ పరాగ్ (9), వాన్‌డర్ డుసెన్ (12 నాటౌట్) డెత్ ఓవర్లలో అంచనాలను అందుకోలేదు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 160 పరుగులకే పరిమితమైంది.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 160/6 (అశ్విన్ 50, దేవదత్ పడిక్కల్ 48, చేతన్ సకారియ 2/23, మిచెల్ మార్ష్ 2/25)
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 161/2 ( మిచెల్ మార్ష్ 89, డెవిడ్ వార్నర్ 52, ట్రెంట్ బౌల్ట్ 1/32, చాహల్ 1/43)