Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీలక నాకౌట్ సమరానికి ముందు టీమ్ ఇండియా కఠిన సవాల్ ఎదుర్కొంది. క్వార్టర్ఫైనల్లో బలమైన ప్రత్యర్థులతో పోటీపడేందుకు గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో సన్నాహకంలో ఆడారు. థామస్ కప్‌లో పురుషుల జట్టు ఉత్కంఠ పోరులో పోరాడి ఓడారు. ఉబెర్ కప్‌లో మహిళల జట్టు నిరాశపరిచింది. దక్షిణ కొరియాతో పోరులో ఐదు మ్యాచుల్లోనూ అనూహ్య పరాజయం చవిచూసింది.
- 2-3తో చైనీస్ తైపీ చేతిలో ఓటమి
- అమ్మాయిలకు 0-5తో దారుణ భంగపాటు
- థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్
నవతెలంగాణ-బ్యాంకాక్
థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్‌లో ఆరంభం నుంచీ విశేషంగా ఆకట్టుకుంటున్న టీమ్ ఇండియా మహిళల, పురుషుల జట్లు గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో నిరాశపరిచాయి. మహిళల జట్టు గ్రూప్-డిలో దక్షిణ కొరియా చేతిలో అనూహ్యంగా దారుణ పరాజయం చవిచూసింది. 0-5తో ఐదు మ్యాచుల్లోనూ ఓటమి చెందింది. మరోవైపు పురుషుల జట్టు అగ్రజట్టు చైనీస్ తైపీతో పోరాడి ఓడారు. 2-3తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్నారు. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత జట్లు థామస్, ఉబెర్ కప్‌లలో క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఊహించన ఫలితం! : థామస్ కప్ చరిత్రలో భారత్ ఎన్నడూ పతకం సాధించలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా థామస్ కప్‌లో భారత్ బలమైన జట్టును బరిలో నిలిపింది. గ్రూప్-సిలో అగ్రస్థానంపై కన్నేసిన టీమ్ ఇండియా తృటిలో చైనీస్ తైపీకి టాప్ పొజిషన్‌ను కోల్పోయింది. వరల్డ్ నం.9 లక్ష్యసేన్ తొలి సింగిల్స్‌లో మారథాన్ పోరాటం చేశాడు. మూడు గేముల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో చో టిన్ చెన్ పైచేయి సాధించాడు. గంటన్నర పాటు ఉత్కంఠ నడిచిన సమరంలో 19-21, 21-13, 17-21తో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌ను చివర్లో కోల్పోయిన లక్ష్యసేన్.. రెండో గేమ్‌లో గొప్పగా పుంజుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ పోరాడినా.. ప్రత్యర్థి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో చైనీస్ తైపీ 1-0 ఆధిక్యం సాధించింది. తొలి డబుల్స్ మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు నిరాశపరిచారు. 11-21, 19-21తో వరుస గేముల్లోనే చేతులెత్తేశారు. లీ యాంగ్, వాంగ్ చి లిన్లు 40 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో చైనీస్ తైపీ ఆధిక్యం 2-0కు పెరిగింది. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. 21-19, 21-16తో కిదాంబి శ్రీకాంత్ వరుస గేముల్లో గెలుపొందాడు. 53 నిమిషాల మ్యాచ్‌లో వాంగ్ జు వీపై అదిరే విజయం నమోదు చేశాడు. 1-2తో భారత్ ఆశలను సజీవంగా నిలిపాడు. రెండో డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల నిరాశపరిచారు. 17-21, 21-19, 19-21తో గంటన్నర పాటు పోరాడి ఓడారు. మూడు గేముల మ్యాచ్‌లో చివరి వరకు విజయం కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు. 3-1తో చైనీస్ తైపీ గ్రూప్‌లో అగ్రస్థానం ఖాయం చేసుకుంది. నామమాత్రపు మూడో సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణరు 21-18, 17-21, 21-18తో గెలుపొందాడు. గంటకు పైగా సాగిన పోరులో ప్రణరు మూడు గేముల మ్యాచ్‌లో విజయం సాధించాడు. చైనీస్ తైపీ ఆధిక్యాన్ని 2-3తో తగ్గించాడు.
సింధు సైతం.. : ఉబెర్ కప్‌లో భారత్‌కు దారుణ భంగపాటు ఎదురైంది. గ్రూప్-డిలో చివరి మ్యాచ్‌లో అమ్మాయిలు తేలిపోయారు. కెనడా, అమెరికాలపై వరుసగా 4-1తో విజయం సాధించిన టీమ్ ఇండియా.. బలమైన దక్షిణ కొరియా చేతిలో చేతులెత్తేసింది. 0-5తో వైట్‌వాష్ ఓటమి మూటగట్టుకుంది. తొలి సింగిల్స్‌లో పి.వి సింధు 15-21, 14-21తో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 42 నిమిషాల్లోనే సింధుపై ఏఎన్ సియోంగ్ పైచేయి సాధించింది. లీ సోహీ, షిన్ జంట డబుల్స్ మ్యాచ్‌లో 21-13, 21-12తో శృతి మిశ్రా, సిమ్రన్సింగ్లపై గెలుపొందారు. మరో సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 10-21, 10-21తో చేతులెత్తేసింది. రెండో డబుల్స్ పోరులో తనీశ, జొలీ జోడీ 14-21, 11-21తో ఓటమి పాలైంది. అస్మిత చాలిహ 18-21, 17-21తో చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. భారత్ ఐదు మ్యాచుల్లోనూ వెనుకంజ వేసి 0-5తో ఓటమి పాలైంది.
థారులాండ్‌తో ఢ : నేడు కీలక క్వార్టర్ఫైనల్లో అగ్రజట్టు థారులాండ్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన థారులాండ్‌ను గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచిన భారత్ ఎదుర్కొనుంది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన షట్లర్లతో కూడిన థారులాండ్‌ను ఎదుర్కొవటం భారత్‌కు అంత సులువు కాదు. రచనోక్ ఇంటనాన్, పొర్నపవీ చొచువాంగ్, బుసానన్లు సింగిల్స్‌లో కఠిన ప్రత్యర్థులు. డబుల్స్ విభాగంలో థారులాండ్‌కు ప్రపంచ శ్రేణి షట్లర్లు అందుబాటులో ఉన్నారు. నేడు క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత్‌కు అవకాశాలు తక్కువే అని చెప్పాలి. అయినా, అమ్మాయిలు పోరాట పటిమతో రాణిస్తే సెమీస్ చేరటం సాధ్యమే!. థామస్ కప్‌లోనూ భారత్‌కు కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రూప్-బిలో చైనా అగ్రస్థానంలో నిలిస్తే.. గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచిన భారత్‌తో తలపడాల్సి ఉంటుంది. తొలిసారి పతకం ఆశిస్తున్న భారత్‌కు మింగుడుపడని డ్రా కానుంది!.