Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 97 పరుగులకే కుప్పకూలిన సూపర్‌కింగ్స్
- 5 వికెట్ల తేడాతో ముంబయి ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
వరుస పరాజయాలు చవిచూసినా.. ప్లే ఆఫ్స్ రేసులో ఇతర సమీకరణాల అండతో స్వల్ప అవకాశాలు మిగిలే ఉన్న తరుణంలో చెన్నై సూపర్‌కింగ్స్ అనూహ్య పరాజయం మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్‌తో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి చెంది.. ప్లే ఆఫ్స్ రేసు వైదొలిగింది. 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 14.5 ఓవర్లలోనే ఛేదించింది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (34 నాటౌట్, 32 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెన్నై పేసర్ ముకేశ్ చౌదరి వరుస వికెట్లతో ముంబయి శిబిరంలో భయం పుట్టించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ (18, 14 బంతుల్లో 4 ఫోర్లు) తోడుగా తిలక్ వర్మ నిర్మాణాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ (6), డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) విఫలమయ్యారు. హృతిక్ షోకిన్ (18, 23 బంతుల్లో 2 ఫోర్లు), టిమ్ డెవిడ్ (16 నాటౌట్, 7 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు. తొలుత, ముంబయి ఇండియన్స్ బౌలర్లు సమిష్టిగా విజృంభించటంతో చెన్నై సూపర్‌కింగ్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. డానియల్ శామ్స్ (3/16) టాప్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ సైతం ముంబయి బౌలర్ల ధాటకి నిలువలేకపోయింది. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (36 నాటౌట్, 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చెన్నై సూపర్‌కింగ్స్‌కు గౌరవప్రద స్కోరు ఇవ్వలేకపోయింది. చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరూ నిలువలేకపోయారు. 16 ఓవర్లలోనే 97 పరుగులకు చెన్నై సూపర్‌కింగ్స్ కుప్పకూలింది. డానియల్ శామ్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
చెన్నై విలవిల : టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఈ మ్యాచ్‌లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగింది. గాయంతో జడేజా దూరం కావటంతో ఈ సీజన్లో జడ్డూ లేకుండా సూపర్‌కింగ్స్ తొలి మ్యాచ్ ఆడింది!. పవర్‌ప్లేలో సూపర్‌కింగ్స్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఓ ఎల్బీడబ్య్లూ నిర్ణయం ఆ జట్టు పతనాన్ని శాసించింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (0)ను డానియల్ శామ్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సూచనతో సమీక్ష కోరకుండానే కాన్వే వెనుదిరిగాడు. కానీ ఆ బంతి లెగ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. కాన్వే (0) డకౌట్ కాగా.. మోయిన్ అలీ (0) సైతం అదే బాటలో నడిచాడు. రాబిన్ ఉతప్ప (1)ను బుమ్రా సాగనంపగా.. రుతురాజ్ గైక్వాడ్ (7) శామ్స్ ఓవర్లోనే వికెట్ కోల్పోయాడు. అంబటి రాయుడు (10) సైతం విఫలం కావటంతో 39 పరుగులకే చెన్నై సూపర్‌కింగ్స్ ఆరు వికెట్లు కోల్పోయింది. అత్యంత తక్కువ స్కోరు ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (36 నాటౌట్) ఒంటరి పోరాటంతో చెన్నైని ఆదుకునే ప్రయత్నం చేశాడు. డ్వేన్ బ్రావో (12, 15 బంతుల్లో 1 సిక్స్) తోడుగా చెన్నైకి 130-140 పరుగులు అందించేలా కనిపించాడు. కానీ మరో ఎండ్‌లో బ్రావో వికెట్ కోల్పోవటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. టెయిలెండర్లు సిమ్రన్‌జిత్ సింగ్ (2), మహీశ్ తీక్షణ (0), ముకేశ్ చౌదరి (4) ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. 16 ఓవర్లలో 97 పరుగులకు చెన్నై సూపర్‌కింగ్స్ కథ కంచికి చేరింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో డానియల్ శామ్స్ మూడు వికెట్లు తీసుకోగా.. రిలె మెరెడిత్, కుమార కార్తీకేయ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : 97/10 (ఎం.ఎస్ ధోని 36 నాటౌట్, డ్వేన్ బ్రావో 12, డానియల్ శామ్స్ 3/16, కార్తీకేయ 2/22)
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : 103/5 (తిలక్ వర్మ 34 నాటౌట్, రోహిత్ శర్మ 18, హృతిక్ షోకీన్ 18, ముకేశ్ చౌదరి 3/23)