Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా ఆధిపత్యానికి భారత్ గండకొట్టినా.. అది ప్రధానంగా సింగిల్స్ సర్క్యూట్కే పరిమితం అయ్యింది!. ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో టీమ్ ఇండియా పెద్దగా ప్రభావం చూపించలేదు. సైనా, సింధు అండతో ఉబెర్ కప్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చినా..థామస్ కప్‌లో పురుషుల జట్టు పతకం ఆలోచనకు సైతం దూరంగానే ఉండిపోయింది!. కానీ, ఇప్పుడు కథ మారిపోయింది. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ ప్రపంచ శ్రేణి షట్లర్లతో బరిలోకి దిగిన భారత్ థామస్ కప్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో తొట్టతొలి పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ఫైనల్లో మలేషియాపై 3-2తో గెలుపొందిన భారత్ సెమఫైనల్లోకి చేరుకుని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
- ఉబెర్ కప్ నుంచి అమ్మాయిలు అవుట్
- థామస్ కప్‌లో భారత్ నవ చరిత్ర
- తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశం
- కనీసం కాంస్య పతకం ఖాయం
నవతెలంగాణ-బ్యాంకాక్
థామస్ కప్‌లో కొత్త చరిత్ర. టీమ్ ఇండియా పురుషుల జట్టు ప్రతిష్టాత్మక టోర్నీలో అద్వితీయ ప్రదర్శన చేసింది. థామస్ కప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థామస్ కప్ ఫైనల్స్‌లో కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. గురువారం బ్యాంకాక్‌లో జరిగిన క్వార్టర్ఫైనల్లో మలేషియాపై భారత్ 3-2తో మెరుపు విజయం నమోదు చేసింది. అగ్ర షట్లర్ కిదాంబి శ్రీకాంత్, సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు సహా డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు చారిత్రక విజయాలు నమోదు చేశారు. థామస్ కప్‌లో భారత్‌ను సెమీఫైనల్స్‌కు చేర్చారు.
చరిత్ర కొట్టేశారు : గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో ఓటమి చెందిన భారత జట్టు.. క్వార్టర్ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందనే అనుమానాలు ఉదయించాయి. కానీ కోర్టులో ఆటతోనే భారత్ సమాధానం చెప్పింది. అయితే, వరల్డ్ నం.9, ఫామ్‌లో ఉన్న క్రీడాకారుడు లక్ష్యసేన్ తొలి సింగిల్స్ మ్యాచ్‌లో నిరాశపరచటంతో భారత్ పతక ఆశలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 21-23, 9-21తో వరుస గేముల్లో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు. మలేషియా షట్లర్ లీ జి జియా 46 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కీలక తొలి డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ భారత్‌ను రేసులో నిలిపింది. 21-19, 21-15తో 41 నిమిషాల్లోనే మ్యాచ్‌లో గెలుపొందింది. రెండో సింగిల్స్ పోరులో కిదాంబి శ్రీకాంత్ సైతం చెలరేగాడు. 21-11, 21-17తో భారత్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. రెండో డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్, విష్ణువర్థన్ జోడీ 19-21, 17-21తో నిరాశపరిచింది. దీంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణయాత్మక మూడో సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణరు భారత్‌కు చారిత్రక విజయాన్ని కట్టబెట్టాడు. 21-13, 21-8తో లియోంగ్ జున్ హవోపై వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. 3-2తో మలేషియాపై భారత్ విజయం సాధించింది.
అమ్మాయిలు అవుట్ : ఉబెర్ కప్‌లో టీమ్ ఇండియా పోరాటానికి తెరపడింది. 2014, 2016లలో కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ సారి క్వార్టర్ఫైనల్లోనే నిష్క్రమించింది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లేని లోటు కీలక క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. థారులాండ్‌తో పోరులో భారత్ తొలి మూడు మ్యాచుల్లోనే చేతులెత్తేసింది. 0-3తో సెమీఫైనల్స్ బెర్త్‌ను కోల్పోయింది. స్టార్ షట్లర్ పి.వి సింధు వరుసగా రెండో టైలో కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తొలి సింగిల్స్‌లో థారులాండ్ అగ్రషట్లర్ రచనోక్ ఇంటనాన్ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో సింధు చేతులెత్తేసింది. 21-18, 17-21, 12-21తో 59 నిమిషాల మ్యాచ్‌లో సింధు నిరాశపరిచింది. మహిళల డబుల్స్‌లో శృతి మిశ్రా, సిమ్రన్ సింఘీ 16-21, 13-21తో వరుస గేముల్లో తేలిపోయారు. 37 నిమిషాల్లోనే థారు జోడీ రవిండ, కిటితరాకుల్లు విజయం సాధించారు. దీంతో థారులాండ్ 2-0 ఆధిక్యం సాధించింది. కీలక రెండో సింగిల్స్ మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. పొర్నపవీ చొచువాంగ్ చేతిలో 16-21, 11-21తో వరుస గేముల్లోనే పరాజయం పాలైంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో 0-5తో చిత్తుగా ఓడిన సింధుసేన.. క్వార్టర్ఫైనల్లో ప్రదర్శనను ఏమాత్రం మెరుగుపర్చుకోలేదు. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే థారులాండ్ 3-0తో ఘన విజయం సాధించింది. దర్జాగా సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.