Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ వ్యాఖ్యలు
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అత్యుత్తమ ఫినీషర్‌గా ఆకట్టుకున్నాడని మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రసారదారుతో మాట్లాడుతూ టీమ్ ఇండియా టర్బోనేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆఫ్‌సైడ్ షాట్లతో పోల్చితే లెగ్‌సైడ్ షాట్లను కార్తీక్ గొప్పగా ఆడుతున్నాడు. తన ఆటను కార్తీక్ ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నాడు. చివర్లో ఏ చిన్న అవకాశం లభించినా.. బెంగళూర్‌కు విజయం కట్టబెడుతున్నాడు. నాకు తెలిసి, ఈ ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమంగా ఫినిషర్ పాత్రను పోషించిన బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది దినేశ్ కార్తీకే. నేనే సెలక్టర్‌ను అయితే రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత జట్టులోకి దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేస్తాను. ఎందుకంటే అందుకు అతడు పూర్తిగా అర్హుడు. భారత జట్టుకు ఫినిషర్లు కావాల్సి వస్తే అది కచ్చితంగా దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యలే అవ్వాలి. ఈ ఇద్దరితో కూడిన జట్టు ఎంతో పటిష్టంగా తయారవుతుంది' అని హర్బజన్ సింగ్ అన్నాడు.