Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థామస్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా
- సెమీస్‌లో 3-2తో డెన్మార్క్‌పై గెలుపు
- శ్రీకాంత్, ప్రణరు అద్వితీయ విజయాలు
- సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ మరో సంచలనం
థామస్ కప్‌లో టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 73 ఏండ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం డెన్మార్క్‌తో జరిగిన సెమీఫైనల్ సమరంలో టీమ్ ఇండియా 3-2తో గెలుపొందింది. కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరు సహా డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్ శెట్టిలు భారత్‌కు సంచలన విజయాన్ని కట్టబెట్టారు. థామస్ కప్ ఫైనల్లో అగ్రజట్టు ఇండోనేషియాతో అమీతుమీకి భారత్ రంగం సిద్ధం చేసుకుంది. టైటిల్ పోరుకు చేరుకున్న టీమ్ ఇండియా కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.
నవతెలంగాణ-బ్యాంకాక్
కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల ముంగిట టీమ్ ఇండియా బ్యాడ్మింటన్‌లో గొప్ప విజయమే సాధించింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్‌లో తొలిసారి టైటిల్ పోరులో అడుగుపెట్టింది. ఐదు మ్యాచుల పాటు ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్ పోరులో టీమ్ ఇండియా 3-2తో డెన్మార్క్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. సెమీఫైనల్ టై 2-2 సమంగా ఉన్న తరుణంలో నిర్ణయాత్మక మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణరు నరాలు తెగే ఉత్కంఠను ఛేదిస్తూ చెలరేగాడు. మూడు గేముల్లో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టాడు. డెన్మార్క్‌పై విజయంతో టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఇండోనేషియాతో భారత్ పసిడి పోరాటం చేయనుంది.
చరిత్ర లిఖించారు! : థామస్ కప్ చరిత్రలో ఎన్నడూ ఓ పతకం సాధించలేని టీమ్ ఇండియా.. ఈ ఏడాది పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. గత టోర్నీలో క్వార్టర్ఫైనల్స్కు చేరిన టీమ్ ఇండియా పురుషుల జట్టు.. ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే ధృడ సంకల్పంతో కనిపించింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. క్వార్టర్ఫైనల్లో, తాజాగా సెమీఫైనల్లో ఐదు మ్యాచుల ఉత్కంఠ పోరులో చారిత్రక విజయాలు నమోదు చేశారు. స్టార్ షట్లర్, వరల్డ్ నం.9 లక్ష్యసేన్ మరోసారి అత్యుత్తమ ప్రత్యర్థితో తలపడి నిరాశపరిచినా.. అదేమీ భారత్‌ను వెనక్కి లాగలేదు. సెమీఫైనల్లో తొలుత లక్ష్యసేన్ తొలి సింగిల్స్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అగ్ర షట్లర్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో వరుస గేముల్లో లక్ష్యసేన్ పరాజయం పొందాడు. 13-21, 13-21తో 49 నిమిషాల్లోనే మ్యాచ్‌ను కోల్పోయాడు. విక్టర్ అక్సెల్సెన్కు లక్ష్యసేన్ పోటీనిచ్చినా.. పాయింట్లుగా మలచుకోవటంలో యువ షట్లర్ విఫలమయ్యాడు. దీంతో 0-1తో భారత్ వెనుకంజ వేసింది. తొలి డబుల్స్ పోరులో వరల్డ్ నం.9 జంట సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు సంచలన విజయం నమదు చేశారు. 21-18, 21-23, 22-20తో కిమ్, మథియస్ క్రిస్టియన్లపై అదిరే విజయం సాధించారు. తొలి గేమ్‌లో 21-18తో గెలుపొందిన సాత్విక్, చిరాగ్ జంట.. రెండో గేమ్‌లో టైబ్రేకర్‌లో గేమ్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ సైతం టైబ్రేకర్‌కు దారితీసింది. ఈ సారి ఒత్తిడిని చిత్తు చేసిన సాత్విక్, చిరాగ్ మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను వశం చేసుకున్నారు. స్కోరు 1-1తో సమం చేశారు. కీలక రెండో సింగిల్స్ సమరంలో కిదాంబి శ్రీకాంత్ సత్తా చాటాడు. అండర్స్ అంటోన్సెన్ను మూడు గేముల్లో మట్టికరిపించాడు. 21-18, 13-21, 21-15తో గంటన్నర మ్యాచ్‌లో డెన్మార్ షట్లర్‌పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను అలవోకగా సాధించిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో తేలిపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లాడు. భారత్‌ను 2-1తో ఆధిక్యంలో నిలబెట్టాడు. రెండో డబుల్స్ పోరులో కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జంట 14-21, 13-21తో ఓటమిపాలవటంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణయాత్మక ఐదో మ్యాచ్ (మూడో సింగిల్స్)లో హెచ్.ఎస్ ప్రణరు మరోసారి భారత్‌ను ఆదుకున్నాడు. రాస్మస్ గెమ్కేను మూడు గేముల్లో మట్టి కరిపించాడు. 13-21, 21-9, 21-12తో కండ్లుచెదిరే విజయం సాధించాడు. తొలి గేమ్‌ను తేలిగ్గా కోల్పోయిన ప్రణరు.. భారత్ ఫైనల్స్ ఆశలను ఆవిరి చేసినట్టే అనిపించింది. కానీ వరుస గేముల్లో పుంజుకున్న ప్రణరు గొప్ప ప్రదర్శన చేశాడు. డెన్మార్క్ షట్లర్‌ను చిత్తుగా ఓడించాడు. 73 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి భారత్‌ను చారిత్రక థామస్ కప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు.