Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ అర్థ శతకాలు
- బెంగళూర్‌పై పంజాబ్ ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి దెబ్బ. 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో బెంగళూర్ దారుణ ఓటమి. ధనాధన్ విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో అవకాశాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. 210 పరుగుల భారీ ఛేదనలో బెంగళూర్ 20 ఓవర్లలో 155 పరుగులే చేసింది. రబాడ (3/21), చాహర్ (2/37), రిషీ (2/37) రాణించటంతో బెంగళూర్ చేతులెత్తేసింది. ఆ జట్టులో మాక్స్వెల్ (35), పాటిదార్ (26), విరాట్ కోహ్లి (20) ఓ మోస్తరు పరుగులు సాధించారు. అంతకముందు, జానీ బెయిర్‌స్టో (66, 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), లియాం లివింగ్‌స్టోన్ (70, 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారుటాప్ ఆర్డర్లో బెయిర్‌స్టో, మిడిల్ ఆర్డర్లో లివింగ్‌స్టోన్ సూపర్ ఇన్నింగ్స్‌లతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
బెయిర్‌స్టో చితకబాదాడు : ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (66), శిఖర్ ధావన్ (21) దండయాత్రతో పవర్‌ప్లేలో పంజాబ్ పరుగుల వరద పారించింది. జానీ బెయిర్‌స్టో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన బెయిర్‌స్టో బెంగళూర్ బౌలర్లను ఆడుకున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ స్కోరు 83 పరుగులు. పవర్‌ప్లే అనంతరం బెంగళూర్ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ఆ తర్వాతి నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులే ఇచ్చారు. అర్థ సెంచరీ అనంతరం జానీ బెయిర్‌స్టో నిష్క్రమించగా స్కోరు బోర్డు బాధ్యతను మరో ఇంగ్లాండ్ బ్యాటర్ లియాం లివింగ్‌స్టోన్ (70) తీసుకున్నాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిన లివింగ్‌స్టోన్ 35 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. సహచర బ్యాటర్ల సహకారం లోపించినా.. లివింగ్ స్టోన్ డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు పిండుకున్నాడు. లివింగ్‌స్టోన్ ధనాధన్ షోతో పంజాబ్ కింగ్స్ 209 పరుగుల భారీ స్కోరు సాధించింది.
స్కోరు వివరాలు :
పంజాబ్ ఇన్నింగ్స్ : 209/9 (లివింగ్‌స్టోన్ 70, బెయిర్‌స్టో 66, హర్షల్ పటేల్ 4/34)
బెంగళూర్ ఇన్నింగ్స్ : 155/9 (మాక్స్వెల్ 35, పాటిదార్ 26, కగిసో రబాడ 3/21)