Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 54 పరుగుల తేడాతో కోల్‌కత గెలుపు
- నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
నవతెలంగాణ-పుణె
సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చిత్తు. సీజన్ ఆరంభంలో వరుసగా ఐదు విజయాలు సాధించిన హైదరాబాద్.. తాజాగా వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 178 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ 123 పరుగులే చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (43, 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎడెన్ మార్కరం (32, 25 బంతుల్లో 3 సిక్స్‌లు) మినహా మరో బ్యాటర్ రాణించలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9), రాహుల్ త్రిపాఠి (9), నికోలస్ పూరన్ (2), వాషింగ్టన్ సుందర్ (4) సమిష్టిగా చేతులెత్తేశారు. 54 పరుగుల తేడాతో కోల్‌కత నైట్‌రైడర్స్ భారీ విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఆండ్రీ రసెల్ (3/22) మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. తొలుత, విధ్వంసకారుడు అండ్రీ రసెల్ (49 నాటౌట్, 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విశ్వరూపం చూపించటంతో కోల్‌కత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. శామ్ బిల్లింగ్స్ (34, 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అజింక్య రహానె (28, 24 బంతుల్లో 3 సిక్స్‌లు), నితీశ్ రానా (26, 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు.
రసెల్ మెరుపులు : కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. డ్యాషింగ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జాన్సెన్ అతడిని వెనక్కి పంపించాడు. మరో ఓపెనర్ అజింక్య రహానె (28), నితీశ్ రానా (26) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి కోల్‌కత 55/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ పవర్ ప్లే అనంతరం కోల్‌కత బ్యాటర్లు పరుగుల వేటలో వెనుకంజ వేశారు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. మిడిల్ ఆర్డర్లో శామ్ బిల్లింగ్స్ (34, 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా.. రన్‌రేట్ తక్కువగానే ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15), రింకూ సింగ్ (5) విఫలమయ్యారు. దీంతో కోల్‌కత స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా కనిపించింది. ఫామ్‌లో లేని అండ్రీ రసెల్ (49 నాటౌట్) సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సైతం ఆరంభంలో పేలవంగా కనిపించాడు. ఎదుర్కొన్న తొలి 12 బంతులు అనంతరమే సిక్సర్ బాదగలిగాడు. కానీ ఒక్కసారి బౌండరీ బాదిన అనంతరం రసెల్ గేర్ మార్చాడు. సిక్సర్ల మోత మోగించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. రసెల్ ధనాధన్ షోతో కోల్‌కత 177 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు :
కోల్‌కత ఇన్నింగ్స్ : 177/6 (అండ్రీ రసెల్ 49, శామ్ బిల్లింగ్స్ 34, అజింక్య రహానె 28, ఉమ్రాన్ మాలిక్ 3/33)
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 123/8 (అభిషేక్ శర్మ 43, మార్కరం 32, అండ్రీ రసెల్ 3/22, టిమ్ సౌథీ 2/23)