Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్. ఆదివారం పసిడి సమరం. 13 సార్లు చాంపియన్ ఇండోనేషియా ఓ వైపు. 73 ఏండ్లలో తొలిసారి ఫైనల్స్‌కు చేరుకున్న టీమ్ ఇండియా మరోవైపు. సహజంగానే ఇండోనేషియా పసిడి ఫేవరేట్‌గా బరిలో నిలుస్తుంది. కానీ ఇండోనేషియాకు తుది సమరంలో ప్రత్యర్థిని ఎదుర్కొవటం అంత సులువు కాదు. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో అద్వితీయ విజయాలు నమోదు చేసి చారిత్రక ఫైనల్లోకి ప్రవేశించిన టీమ్ ఇండియా నేడు తుది పోరులోనూ అదే స్ఫూర్తితో స్మాష్ కొట్టేందుకు సిద్ధమైంది. భారత్ పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్, ఇండోనేషియా మధ్య నేడు థామస్ కప్ ఫైనల్స్ సమరం.
- ఇండోనేషియాతో తుది సమరం నేడు
- టీమ్ ఇండియా శిబిరంలో పసిడి ఆశలు
- థామస్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ 2022
నవతెలంగాణ-బ్యాంకాక్
థామస్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్. ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్. బ్యాడ్మింటన్ ఆడే ప్రతి దేశం ఆడాలని కోరుకునే, ఓ పతకమైనా సాధించాలని స్వప్నించే టోర్నమెంట్ థామస్ కప్. 73 ఏండ్ల థామస్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా ఎన్నడూ పతకం సాధించలేదు. థామస్ కప్ తొలినాళ్లలో ఓసారి సెమీఫైనల్స్‌కు చేరినా.. ఆ సమయంలో సెమీస్‌కు చేరితే పతకం ఖాయం కాదు. దీంతో అప్పుడు భారత్‌కు పతకం దక్కలేదు. ఇటీవల కాలంలో భారత బ్యాడ్మింటన్ బలం విప్లవాత్మకంగా పెరిగింది. సింగిల్స్ సర్క్యూట్లో సరికొత్త స్టార్ అవతరించగా.. డబుల్స్ సర్క్యూట్లో ప్రపంచ శ్రేణి జంట అందుబాటులోకి వచ్చింది. బ్యాడ్మింటన్ అనగానే ఆసియా దేశాలదే ఆధిపత్యం. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పసిడి పతకం సాధించినా.. బ్యాడ్మింటన్ ప్రపంచంలో అంతగా గుర్తింపు దక్కదు. థామస్ కప్‌లో ఆసియా అగ్రదేశాలు సహా ప్రపంచ దేశాలు పోటీపడతాయి. దీంతో బ్యాడ్మింటన్‌లో థామస్ కప్ ఫైనల్స్‌ను ప్రపంచకప్‌గా పరిగణించవచ్చు!. అటువంటి ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ ఆడుతున్న తరుణంలో.. పురుషుల జట్టుపై ఎటువంటి అంచనాలు లేవు. ఎన్నడూ పతకం సాధించని జట్టు ఈసారి కనీసం పతక ఆశలైనా చిగురింపచేస్తుందేమో అనే అంచనాలు మినహా పెద్దగా ఫోకస్ లేదు. కానీ మెన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి థామస్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు ఇండోనేషియాతో అమీతుమీ తేల్చుకుని పసిడి పట్టుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
బంగారు అవకాశం! : థామస్ కప్ ఫైనల్లో భారత్ తొలిసారే తలపడుతుంది. ఇండోనేషియా ఇప్పటికే 13 సార్లు థామస్ కప్ పసిడి ముద్దాడింది. అయినా, నేడు టీమ్ ఇండియా పసిడి ఫేవరేట్ అని చెప్పేందుకు ఉత్సాహభరిత గణాంకాలు ముందున్నాయి. బ్యాడ్మింటన్ పవర్‌హౌస్ ఇండోనేషియా కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. జట్టుతో ఉన్న ఆటగాళ్లు నిలకడగా రాణించటం లేదు. ఓ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడితే, మరో మ్యాచ్‌లో తేలిపోతున్నారు. ఇది భారత్‌కు బాగా కలిసొచ్చే అంశం. పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా సాగితే.. చివరి మ్యాచ్‌లో హెచ్.ఎస్ ప్రణరు హీరోయిక్స్ అవసరం లేకుండానే భారత్ పసిడి కొట్టగలదు!.
యువ షట్లర్ లక్ష్యసేన్ చేరిన భారత జట్టును బలోపేతం చేసింది. వరల్డ్ నం.9తో లక్ష్యసేన్ భారత్‌కు అత్యుత్తమ ర్యాంక్ ఆటగాడు. దీంతో తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఆడుతుండగా.. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ రెండో సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నాడు. సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు మూడో సింగిల్స్, కీలక చివరి మ్యాచ్‌లో ఆడుతున్నాడు. ఈ కాంబినేషన్ భారత్‌కు గొప్ప ఫలితాల్ని అందించింది. కలుషిత ఆహారంతో లక్ష్యసేన్ గత మ్యాచుల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. ర్యాంకింగ్స్‌లో టాప్ షట్లర్లతో పోటీపడిన లక్ష్యసేన్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ నుంచి క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్లో లక్ష్యసేన్ పరాజయాలు చవిచూశాడు. దీంతో భారత్ 0-1 వెనుకంజతోనే రేసును మొదలుపెట్టింది. నేడు ఇండోనేషియాతో మ్యాచ్‌లో సైతం లక్ష్యసేన్ మెరుగైన ప్రత్యర్థితో తలపడనున్నాడు. వరల్డ్ నం.5 ఆంటోని జింటింగ్‌తో లక్ష్యసేన్ ఆడనున్నాడు. ఆంటోనితో ముఖాముఖి పోరులో లక్ష్యసేన్ 1-0 ముందంజలో ఉన్నాడు. ఇటీవల యూరోప్ సీజన్లో (జర్మన్ ఓపెన్) ఆంటోనిపై లక్ష్యసేన్ 21-7, 21-9తో తిరుగులేని విజయం సాధించాడు. వేగంగా దూసుకొచ్చే ర్యాలీలను ఇష్టపడే ఆంటోనిని లక్ష్యసేన్ సులువుగా ఓడించాడు. ఆ ఆత్మవిశ్వాసంతో నేడు తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫేవరేట్‌గా ఆడనున్నాడు. తొలి డబుల్స్ సమరంలో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలకు సైతం ఇండోనేషియా జంటపై మంచి రికార్డుంది. కెవిన్ సంజయ, మహ్మద్ ఆషన్ జోడీపై మనోళ్లు 1-0తో ముందంజలో కొనసాగుతున్నారు. క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్లో మన జోడీ అదిరే విజయాలు సాధించి ఫామ్‌లో ఉంది. మరోవైపు ఇండోనేషియా జోడీ అంచనాలను అందుకోవం లేదు. నేడు భారత స్టార్ జంటను ఎదుర్కొవటం అంత సులువు కాదు.
థామస్ కప్‌లో భారత ట్రంప్‌కార్డ్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్. తెలుగు తేజం ఐదు మ్యాచుల్లో అదిరే విజయాలు సాధించాడు. జొనాథన్ క్రిస్టీతో ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 4-5తో వెనుకంజలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రెండు మ్యాచుల్లో శ్రీకాంత్‌పై క్రిస్టీ పైచేయి సాధించాడు. అయితే, సెమీస్‌లో కెంటా నిషిమోటో చేతిలో అనూహ్య పరాజయం చవిచూశాడు. ఆ ఓటమి ప్రభావం నేటి మ్యాచ్‌పై పడనుంది. కెరీర్ భీకర ఫామ్, ఆత్మవిశ్వాసంతో ఉన్న శ్రీకాంత్ నేడు ఫేవరేట్‌గా ఆడనున్నాడు. రెండో డబుల్స్‌లో కృష్ణప్రసాద్ , విష్ణువర్ధన్ జోడీలు తమ ఇండోనేషియా ప్రత్యర్థితో ముందెన్నడు పోటీపడలేదు. మూడో సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు తన ప్రత్యర్థి హిరెన్ రుస్తావిటోపై 2-0తో తిరుగులేని పైచేయి సాధించాడు. సుదీర్ఘ టోర్నీల్లో ప్రణరు ఫామ్ నిలకడగా ఉండదు. కానీ థామస్ కప్‌లో ప్రణరు ఆటతీరు అతడి కెరీర్లోనే హైలైట్. భారత్ సెమీస్, ఫైనల్స్‌కు చేరుకునే ఆశలు పూర్తిగా తనపై ఉన్న తరుణంలో నిర్ణయాత్మక మ్యాచ్‌లో ప్రణరు అద్భుతమే చేశాడు. నేడు పసిడి ఫైట్ చివరి మ్యాచ్ వరకు సాగితే.. ఇండోనేషియా ఆటగాడు ప్రణరు ముందు తేలిపోవటం ఖాయమని చెప్పవచ్చు. చావోరేవో తేల్చుకోవాల్సిన ఒత్తిడితో కూడిన మ్యాచుల్లో హెచ్.ఎస్ ప్రణరు అద్వితీయ ప్రదర్శన భారత్‌కు గొప్ప ఆత్మవిశ్వాసం అందిస్తోంది.