Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థామస్ కప్ విజేత టీమ్ ఇండియా
- ఇండోనేషియాపై 3-0తో ఏకపక్ష విజయం
- ఫైనల్లో భారత జట్టు చారిత్రక ప్రదర్శన
సరికొత్త చరిత్ర లిఖించబడింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌కు కొత్త రారాజు. థామస్‌కప్ ఫైనల్లో టీమ్ ఇండియా చారిత్రక విజయం నమోదు చేసింది. 14 సార్లు చాంపియన్, అగ్రజట్టు ఇండోనేషియాను చిత్తుగా ఓడించి 73 ఏండ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించింది. బ్యాడ్మింటన్‌లో ప్రతి దేశం స్వప్పంచే థామస్ కప్ పసిడి ఇప్పుడు భారత్ సొంతం.
అద్భుతం ఆకస్మికంగానే జరుగుతుంది!. థామస్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా చారిత్రక విజయం బయటి ప్రపంచానికి అద్భుతమే, కానీ భారత బ్యాడ్మింటన్ జట్టుకు కాదు!. థామస్ కప్ వేటలో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. మే 15 కోసం చాలా కాలం ముందు నుంచే ప్రణాళిక రచించింది. బ్యాంకాక్‌లో పసిడి పట్టగలమని టీమ్ ఇండియా బలంగా నమ్మటంతోనే.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యద్భుత విజయం ఆవిష్కిరతం కాగలిగింది.
కిదాంబి శ్రీకాంత్ తన ట్రేడ్‌మార్క్ స్మాష్ కోసం గాల్లోకి ఎగిరాడు. క్రాస్కోర్టులోకి జంప్ స్మాష్ సంధించాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో సమయం ఒక్కసారిగా ఆగిన భావన. ఆ స్మాష్‌తో భారత్ చారిత్రక థామస్ కప్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టులో ఎవరూ గంతులేయకుండా ఉండలేకపోతున్నారు. కళ్లలో నుంచి ఆనంద బాష్పాలు వాటంతట అవే వస్తున్నాయి. థామస్ కప్ కొత్త చాంపియన్ భారత్. ఇది ఎవరైనా ఊహించారా?!. బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ సువర్ణాధ్యాయం లిఖించబడింది.
నవతెలంగాణ-బ్యాంకాక్
టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ విజేతగా అవతరించింది. బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన పసిడి పోరులో 14సార్లు చాంపియన్, అగ్రజట్టు ఇండోనేషియాపై 3-0తో ఏకపక్ష విజయం నమోదు చేసిన టీమ్ ఇండియా.. భారత బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ఐదు మ్యాచుల టైటిల్ పోరులో వరుసగా తొలి మూడు మ్యాచుల్లో విజయాలు సాధించిన భారత్.. మరో రెండు మ్యాచులు ఉండగానే పసిడి పట్టేసింది. తొలి సింగిల్స్‌లో వరల్డ్ నం.9 లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16తో గెలుపొందగా.. డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో కెరీర్ బిగ్టెస్ట్ విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో వరుస గేముల్లో గెలుపొంది.. భారత్‌ను సంబురాల్లో ముంచెత్తాడు. 73 ఏండ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 1 కోటి నగదు పురస్కారం ప్రకటించింది.
ముగ్గురు మొనగాళ్లు! : థామస్ కప్ ఫైనల్స్. ప్రత్యర్థి 14 సార్లు విజేత ఇండోనేషియా. వ్యక్తిగత ముఖాముఖి రికార్డుల్లో భారత్‌కు కాస్త అటు ఇటు మొగ్గు కనిపించింది. బ్యాడ్మింటన్ పవర్‌హౌస్‌గా ఇండోనేషియాకు విజయంపై గట్టి నమ్మకం. నాకౌట్లో అద్వితీయ విజయాలు నమోదు చేసిన టీమ్ ఇండియాకు ప్రత్యర్థి బలహీనతల కంటే తమ బలంపై ఎక్కువ విశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం కోర్టులో కనిపించింది. ఐదు మ్యాచుల తుది సమరంలో తొలి మూడు మ్యాచుల్లోనే మనోళ్లు లాంఛనం ముగించారు. చివరి రెండు మ్యాచుల అవసరం ఏర్పడకుండానే ఇండోనేషియాను చిత్తు చేశారు. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్, తొలి డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ, రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టారు. 3-0తో భారత్‌కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాలు కట్టబెట్టిన సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు ఫైనల్లో రాకెట్ పట్టాల్సిన అసవరం ఏర్పడలేదు. హెచ్.ఎస్ ప్రణరు హీరోయిక్స్‌తో ఫైనల్స్‌కు చేరిన భారత్.. ఫైనల్లో అతడి ఏకపక్ష విజయంతో రిటర్న్ గిఫ్ట్ అందించింది.
లక్ష్యసేన్ అదిరెన్ : ఫుడ్ పాయిజన్‌తో క్వార్టర్స్, సెమీస్‌లో నిరాశపరిచిన వరల్డ్ నం.9, యువ షట్లర్ లక్ష్యసేన్ తుది వేటలో జూలు విదిల్చాడు. పూర్తి ఫిట్నెస్తో బరిలో నిలిచిన లక్ష్యసేన్ భారత్‌కు అదిరే విజయంతో తిరుగులేని ఆరంభాన్ని అందించాడు. మూడు గేముల పోరులో 8-21, 21-17, 21-16తో కండ్లుచెదిరే విజయం సాధించాడు. 65 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌ను లక్ష్యసేన్ చిత్తుగా కోల్పోయాడు. ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే ఇండోనేషియా షట్లర్ ఆంటోని గింటింగ్కు ముందంజ వేసే అవకాశం కల్పించాడు. దీంతో లక్ష్యసేన్ మరోసారి భారత్‌కు నిరాశ మిగిల్చేలా కనిపించాడు. ఎవరూ ఊహించని రీతిలో పుంజుకున్న లక్ష్యసేన్ వరుస గేముల్లో విశ్వరూపం చూపించాడు. 11-7తో రెండో గేమ్‌లో విరామ సమయానికి ముందంజలో నిలిచిన లక్ష్యసేన్.. ఎక్కడా ఆధిక్యం కోల్పోలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ ఆరంభంలో వెనుకంజ వేశాడు. 8-11తో విరామ సమయానికి వెనుకంజలో నిలిచాడు. 12-12తో స్కోరు సమం చేసిన లక్ష్యసేన్..15-14, 18-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. వరుసగా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న లక్ష్యసేన్ మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్‌కు 1-0 ఆధిక్యం కట్టబెట్టాడు.
సూపర్‌హిట్టు : డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు తమ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించారు. 73 నిమిషాల ఉత్కంఠ పోరులో 21-18, 21-23, 21-19తో మెరుపు విజయాన్ని సాధించారు. ఇండోనేషియా జంట మహ్మద్ ఆషన్, కెవిన్ సంజయ జోడీపై కండ్లుచెదిరే విజయం సొంతం చేసుకున్నారు. 18-21తో తొలి గేమ్‌ను కోల్పోయిన తరుణంలో తెలుగు తేజం సాత్విక్‌సాయి ప్రదర్శన మ్యాచ్‌ను భారత్ వశం చేసింది. రెండో గేమ్ ప్రథమార్థంలో ముందంజలోనే కొనసాగిన సాత్విక్, చిరాగ్ జోడీ..14-14 అనంతరం వెనకడుగు వేసింది. వరుస పాయింట్లు కోల్పోయి 14-19తో మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ దశలో ముందుకొచ్చిన సాత్విక్‌సాయిరాజ్ ప్రత్యర్థిపై దాడి చేశాడు. వరుసగా నాలుగు మ్యాచ్ పాయింట్లను కాచుకుని సంచలన విజయం నమోదు చేశాడు. సాత్విక్‌పై పూర్తి నమ్మకం ఉంచిన చిరాగ్ శెట్టి.. తెలుగు షట్లర్‌కు తగిన సహకారం అందించగా సాత్విక్ పని పూర్తి చేశాడు. 17-20 నుంచి 23-21తో రెండో గేమ్‌ను గెల్చుకున్నారు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో గేమ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆధిక్యం చేతులు మారింది. 11-9తో విరామ సమయానికి ఆధిక్యంలో ఉన్న మనోళ్లు.. 13-16తో వెనుకంజలో పడిపోయారు. వరుస పాయింట్లతో 16-16తో స్కోరు సమం చేసిన సాత్విక్, చిరాగ్ జోడీ..18-18 వద్ద ప్రత్యర్థిని నిలువరించారు. ఒత్తిడిలో ప్రత్యర్థిని చిత్తు చేసి 21-19తో మూడో గేమ్‌ను, కెరీర్లో అతి పెద్ద మ్యాచ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డబుల్స్ అద్భుత విజయంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
సూపర్ శ్రీకాంత్ : ఈ సీజన్లో జొనాథన్ క్రిస్టీ చేతిలో రెండు సార్లు ఓటమిచెందిన కిదాంబి శ్రీకాత్.. చారిత్రక సమరంలో చాంపియన్ ఆటతీరు ప్రదర్శించాడు. 21-15, 23-21తో వరుస గేముల్లోనే గెలుపొందాడు. 48 నిమిషాల రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌కు ఎదురులేదు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో చెమటోట్చాడు. టైబ్రేకర్‌కు దారితీసిన మ్యాచ్‌లో 23-21తో పైచేయి సాధించాడు. 3-0తో భారత్ థామస్ కప్ ఫైనల్లో ఇండోనేషియా మెడలు వంచి చారిత్రక విజయం సాధించింది.