Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ట్రయల్స్‌లో అనూహ్య ఘటన
- సతీందర్ మాలిక్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ : కెడి జాదవ్ హాల్, ఇందిరాగాంధీ స్టేడియం. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు భారత మెన్స్ రెజ్లింగ్ జట్టుకు ట్రయల్స్. జాతీయ ట్రయల్స్‌లో మునుపెన్నడూ చోటుచేసుకోని విధంగా.. ఓ రెజ్లర్ రిఫరీపై పిడిగుద్దల వర్షం కురిపించాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. భారత రెజ్లింగ్‌లో చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సర్వీసెస్ రెజ్లర్ సతీందర్ మాలిక్ (ఎయిర్‌ఫోర్స్) 125 కేజీల విభాగంలో పోటీపడుతున్నాడు. బౌట్ మరో 18 సెకండ్లలో ముగియనుండగా సతీందర్ మాలిక్ 3-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ప్రత్యర్థి రెజ్లిర్ మోహిత్ ప్రభావశీల 'టేక్‌డౌన్' సహా సతీందర్ మాలిక్‌ను మ్యాట్ మీద నుంచి కిందకు నెట్టాడు. టేక్ డౌన్‌కు రెండు పాయింట్లు ఇవ్వని రిఫరీ వీరెందర్ మాలిక్.. పుష్ఔట్కు ఓ పాయింట్‌ను మాత్రమే కేటాయించాడు. దీంతో మోహిత్ ఆన్ మ్యాట్ రిఫరీ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. జ్యూరి రిఫరీ సత్యదేవ్ మాలిక్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. సతీందర్ మాలిక్, సత్యదేవ్ మాలిక్‌లది ఒకే గ్రామం కావటంతో అతడు జ్యూరి నిర్ణయానికి దూరంగా ఉన్నాడు. మరో సీనియర్ రిఫరీ జగ్బిర్ సింగ్‌ను మోహిత్ సవాల్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాడు. టీవీ రిప్లేలు పరిశీలించిన జగ్బిర్ సింగ్.. మోహిత్‌కు మూడు పాయింట్లు ప్రకటించాడు. దీంతో స్కోరు 3-3తో సమమైంది. స్కోర్లు సమం కావటంతో బౌట్లో చివరి పాయింట్ సాధించిన రెజ్లిర్ మోహిత్‌ను విజేతగా ప్రకటించారు. పక్క మ్యాట్‌లో ఒలింపిక్ హీరో రవి దహియ, ఆమన్‌లు 57 కేజీల విభాగంలో పోటీపడుతుండగా.. వారిని దాటుకుంటూ వెళ్లిన సతీందర్ మాలిక్ నేరుగా రిఫరీ దగ్గరకు వెళ్లాడు. జగ్బిర్సింగ్ను దూషించిన సతీందర్ మాలిక్.. సీనియర్ రిఫరీపై పిడుగుద్దల వర్షం కురిపించాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇతర మ్యాచులను నిలిపివేశారు. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కళ్లెదుటే ఇదంతా చోటుచేసుకుంది. అభిమానులు, రెజ్లర్ల కుటుంబ సభ్యులు చూస్తుండగా సతీందర్ మాలిక్ రెచ్చిపోయాడు. రెజ్లింగ్ సమాఖ్య అధికారులు సతీందర్ మాలిక్‌ను బలవంతంగా కెడి జాదవ్ హాల్ నుంచి బయటకు పంపించారు. సతీందర్ మాలిక్‌పై జీవితకాల నిషేధం విధిస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.
' ఆ బౌట్ రిఫరీల నుంచి సైతం వివరణ కోరనున్నాం. పరిస్థితి ఇంత వరకు రావడానికి వారు కారణమయ్యారు. టేక్‌డౌన్ పట్టు క్లియర్‌గా కనిపించినా.. పాయింట్లు ఎందుకు ఇవ్వలేదో తెలియాలి. నేను 65, 97 కేజీల బౌట్లు చూస్తున్నాను. కోరితేనే ఈ బౌట్లో నిర్ణయం తీసుకున్నాను. సతీందర్పై ఏ చర్యలు తీసుకుంటారనేది రెజ్లింగ్ సమాఖ్యకే వదిలేస్తున్నాను' అని జగ్బిర్ సింగ్ తెలిపాడు. 'సతీందర్ పాల్, నేను ఇరుగు పొరుగు కావటంతో నిర్ణయంలో పక్షపాత ఆరోపణలకు తావులేకుండా నేను తప్పుకున్నాను. అంతర్జాతీయ రెజ్లింగ్‌లోనూ భారత రెజ్లర్ల బౌట్‌కు భారత రిఫరీలు నిర్ణయాలు తీసుకోరు. ఇది ఏమాత్రం ఊహించనది. సతీందర్ మాలిక్ సహజంగానే చాలా నెమ్మదస్థుడు' అని సత్యదేవ్ మాలిక్ తెలిపాడు.