Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై 3 పరుగులతో గెలుపు
- హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
నవతెలంగాణ-ముంబయి
ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరిసింది. ఉత్కంఠకు దారితీసిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. సీజన్లో ఏడో విజయంతో 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్.. ఇతర సమీకరణాల కలసొస్తే ఇప్పటికీ టాప్-4లో నిలిచే అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. 194 పరుగుల భారీ ఛేదనలో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసింది. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి తరుణంలో స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఓ వికెట్ పడగొట్టి ఒక్క పరుగూ ఇవ్వలేదు. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా ముంబయి 15 పరుగులే చేసింది. డెత్ ఓవర్లలో టిమ్ డెవిడ్ (46, 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. నటరాజన్ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది ముంబయిని గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. డెవిడ్ నిష్క్రమణతో మ్యాచ్ ముంబయి చేజారింది. రోహిత్ శర్మ (48, 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (43, 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించినా.. మిడిల్ ఆర్డర్లో డానియల్ శామ్స్ (15), తిలక్ వర్మ (8) వైఫల్యంతో ముంబయి వెనుకడుగు వేసింది. సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ (3/23) మూడు వికెట్లతో మెరిశాడు. తొలుత, రాహుల్ త్రిపాఠి (76, 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ప్రియాం గార్గ్ (42, 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (38, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మెరవటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు సాధించింది.
హైదరాబాద్ దూకుడు : టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ప్రియాం గార్గ్, పేసర్ ఫారుఖీని తీసుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పు సన్‌రైజర్స్‌కు సానుకూల ఫలితాన్ని అందించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు వెళ్లి.. యువ బ్యాటర్ ప్రియాం గార్గ్‌ను ఓపెనర్‌గా దించాడు. అభిషేక్ శర్మ (9) విఫలమైనా.. ప్రియాం గార్గ్ (42) పవర్‌ప్లేలో సత్తా చాటాడు. రాహుల్ త్రిపాఠితో కలిసి ముంబయి ఇండియన్స్ బౌలర్లపై దండెత్తాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన గార్గ్.. అర్థ సెంచరీకి చేరువలో వికెట్ కోల్పోయాడు. మరో ఎండ్‌లో నికోలస్ పూరన్ (38) జతకట్టడంతో రాహుల్ త్రిపాఠి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన త్రిపాఠి సన్‌రైజర్స్‌ను 200 పైచిలుకు స్కోరు దిశగా తీసుకెళ్లాడు. పూరన్ సైతం మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో ధనాధన్ జోరు చూపించాడు. డెత్ ఓవర్లలో బుమ్రా మ్యాజిక్‌తో హైదరాబాద్ 193 పరుగులే చేసింది. చివరి నాలుగు ఓవర్లలో 29 పరుగులే ఇచ్చిన ముంబయి ఇండియన్స్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ముంబయి ఇండియన్స్ యువ పేసర్ రమన్‌దీప్ సింగ్ (3/20) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 193/6 ( రాహుల్ త్రిపాఠి 76, ప్రియాం గార్గ్ 42, నికోలస్ పూరన్ 38, రమన్‌దీప్ 3/20)
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : 190/7 ( రోహిత్ శర్మ 48, టిమ్ డెవిడ్ 46, ఇషాన్ కిషన్ 43, ఉమ్రాన్ మాలిక్ 3/23)