Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్‌తో టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు
లండన్ : కొత్త సీసాలో పాత సారా!. సరికొత్త తరానికి నాంది అంటూ ప్రకటనలు చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. గత ఏడాదిగా నిలకడగా వైఫల్యం చెందిన జట్టునే అధిక శాతం కొనసాగించింది. జూన్ 2 నుంచి న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. హారీ బ్రూక్, మాథ్యూ పాట్స్లకు తొలిసారి టెస్టు జట్టులోకి పిలుపు అందింది. వెటరన్ పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు ఊహించినట్టే పునరాగమనం లభించింది. టెస్టు జట్టు ఎంపికలో కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త చీఫ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ సహా మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ ప్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న జానీ బెయిర్‌స్టోను సైతం జట్టులోకి ఎంపిక చేశారు. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటే.. జానీ బెయిర్‌స్టో జాతీయ జట్టుతో చేరేది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. మాజీ కెప్టెన్ జో రూట్ నం.4, కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్‌లు నం.6 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఒలీ పోప్ కొత్తగా నం.3 స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి రావచ్చు!.
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా మహిళల జట్టు చీఫ్ కోచ్ మాథ్యూ మాట్ను ఇంగ్లాండ్ క్రికెట్ వైట్ బాల్ చీఫ్ కోచ్‌గా ఎంపిక చేశారు. సెలక్షన్ ప్యానల్‌ను మాథ్యూ మాట్ సంతృప్తిపరచటంతో అతడికి కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇంగ్లాండ్ టెస్టు జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రావ్లీ, అలెక్స్ లీస్, జో రూట్, హారీ బ్రూక్, ఒలీ పోప్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్.