Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్
- చారిత్రక స్వర్ణం ముంగిట హైదరాబాదీ బాక్సర్
- సెమీస్‌లో బ్రెజిల్ బాక్సర్ చిత్తు చిత్తు
నవతెలంగాణ-ఇస్తాంబుల్
భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ చారిత్రక పసిడి పతకం ముంగిట నిలిచింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లిన నిఖత్ జరీన్ పసిడి పతకానికి పంచ్ దూరంలోనే ఉంది. బుధవారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం సెమీఫైనల్ బౌట్లో ఒలింపిక్ పతక విజేత, బ్రెజిల్ బాక్సర్ కరొలినా డీ అల్మెదాపై నిఖత్ జరీన్ ఏకపక్ష విజయం సాధించింది. నిఖత్ జరీన్ ఆధిపత్యం నడిచిన సెమీ సమరంలో 5-0తో భారత బాక్సర్ ఏకగ్రీవ విజేతగా అవతరించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 2022లో ఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత బాక్సర్‌గా నిలిచింది. ఆరు సార్లు చాంపియన్ ఎంసీ మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ సి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి సాధించిన బాక్సర్‌గా నిలిచే రికార్డు ముంగిట నిఖత్ జరీన్ నిలిచింది. మరో రెండు సెమీఫైనల్స్‌లో భారత్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మహిళల 57 కేజీల విభాగంలో మనీశ 0-5తో ఓటమి పాలైంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో మనీశ పరాజయం పాలైంది. మహిళల 63 కేజీల విభాగంలో పర్వీన్ పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన ఫైట్‌లో మర్వీన్ 1-4తో యూరోపియన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ఆమీ బ్రాడ్హాస్ట్కు ఫైనల్స్ బెర్త్ కోల్పోయింది. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన మనీశ, పర్వీన్‌లు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మాజీ జూనియర్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్.. పసిడి పోరులో థారులాండ్ యువ బాక్సర్‌ను ఎదుర్కొనుంది.
నిఖత్ పంచ్ అదిరింది : 52 కేజీల మహిళల విభాగంలో నిఖత్ జరీన్ పంచ్ అదిరింది. సాంకేతికంగా తనకంటే మెరుగైన బ్రెజిల్ బాక్సర్‌ను నిఖత్ జరీన్ పదునైన్ పంచ్‌లతో చిత్తు చేసింది. నిఖత్ జరీన్ పవర్ఫుల్ పంచ్‌ల ముందు బ్రెజిల్ బాక్సర్ కరొలినా డీ అల్మెదా తేలిపోయింది. ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను ఏకగ్రీవ విజేతగా ఎంచుకున్నారు. హైదరాబాదీ బాక్సర్ హవా నడిచిన సెమీఫైనల్ ఫైట్‌లో న్యాయమూర్తులు 29-27, 29-27, 30-26, 30-25తో నిఖత్ జరీన్‌కు ఏకపక్ష విజయాన్ని అందించారు. మూడు రౌండ్లలోనూ కరొలినా డీ అల్మెదాపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. మెగా ఈవెంట్లో తొలిసారి పోటీపడుతున్న నిఖత్ జరీన్ అరంగ్రేటంలోనే అదరగొట్టింది. ఆరుసార్లు చాంపియన్, ఎనిమిది పతకాలు సాధించిన దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనటం లేదు. దీంతో ఈ విభాగంలో చాలా కాలం నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిఖత్ జరీన్ అందివచ్చిన అవకాశాన్ని పసిడి పంచ్ వరకు తీసుకెళ్లింది. పసిడి పోరులో నిఖత్ జరీన్‌కు థారులాండ్‌కు చెందిన 24 ఏండ్ల ఒలింపిక్ బాక్సర్ ఎదురు కానుంది. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న నిఖత్ జరీన్ పసిడి ఫైట్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
మరోవైపు 57 కేజీల విభాగంలో మనీశ 26-30, 27-30, 28-30, 28-29, 27-30తో ఓటమి పాలవగా.. 63 కేజీల విభాగంలో పర్వీన్ 28-29, 29-28, 27-30, 28-29, 27-30తో 1-4తో పోరాడి ఓడింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పంచ్ విసిరిన మనీశ, పర్వీన్‌లు కాంస్య పతకాలతో టోర్నీని ముగించారు. 2016 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ నాలుగు పసిడి పతకాలు సహా ఎనిమిది పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. గత వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ రెండు పతకాలే సాధించింది. మంజు రాణి సిల్వర్ సాధించగా.. ఎంసీ మేరీకోమ్ కాంస్య పతకంతో రికార్డు ఎనిమిదో మెడల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.