Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్రాన్ మాలిక్‌పై బోర్డుకు శాస్త్రి సలహా
ముంబయి : జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్‌కు నేరుగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ఇవ్వాలని టీమ్ ఇండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి బోర్డుకు సూచించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉమ్రాన్ మాలిక్ ఉపయుక్త పేసరని, భారత టెస్టు క్రికెట్లో కీలక భూమిక పోషించగల సత్తా, సామర్థ్యం ఉన్నాయని రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని (156.9 కిమి/గంట) సంధించిన ఉమ్రాన్ మాలిక్.. తాజా ఐపీఎల్ సీజన్లో 21 వికెట్లతో అత్యధిక వికెట్లు కూల్చి బౌలర్ల జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ పేస్‌కు బ్యాటర్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. సీజన్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన చేసిన మాలిక్.. అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగిల్చాడు. ' ఉమ్రాన్ మాలిక్‌కు నేరుగా కేంద్ర కాంట్రాక్టు ఇవ్వాలి. టీమ్ ఇండియా ప్రణాళికల్లో అతడిని భాగం చేయాలి. మాలిక్ ఆలోచనలు సానుకూలంగా ఉండేలా బోర్డు చూడాలి. ప్రధాన ఆటగాళ్లతో కలిసి ఉంచటంతో అతడు నేర్చుకుంటాడు. మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రాలతో కలిసి సాధన చేసినప్పుడు వారు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, పని భారం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారనే విషయాలు మాలిక్ నేర్చుకుంటాడు. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్‌ను ఉమ్రాన్ మాలిక్ గొప్పగా ఇరకాటంలో పడేయగలడు. అందుకు తగిన పేస్ అతడి బౌలింగ్‌లో దండిగా ఉందని' రవిశాస్త్రి పేర్కొన్నాడు.